ఫ డ్రైవింగ్ లైసెన్సులకు అడ్డగోలు వసూళ్లు
ఫ కొందరు అధికారుల అవినీతి దందా?
ఫ దళారులతో వంతు నిర్వహణ
ఫ పరీక్ష లేకుండానే పత్రాల జారీ
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): డ్రైవింగ్ లైసెన్స్ అనేది కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు. వాహనాన్ని సురక్షితంగా నడపగల సామర్థ్యాన్ని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనను నిర్ధారించే ముఖ్యమైన అధికారిక పత్రం. అందుకే లెర్నర్ లైసెన్స్ ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగా పరీక్ష, శాశ్వత లైసెన్స్ ప్రక్రియలో వర్తించే డ్రైవింగ్ పరీక్ష వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది. అయితే డబ్బులిస్తే పరీక్ష లేకుండా లైసెన్సులు ఇప్పించే విధానానికి కొందరు అధికారులు శ్రీకారం చుట్టారనే విమర్శలు వస్తున్నాయి. తమకు తెలిసిన దళారుల సహకారంతో ఈ తంతు నడిపిస్తున్నారని సమాచారం.
నిబంధనలు ఇవీ.. : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు ముందుగా లెర్నర్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం రవాణా శాఖ నిర్దేశించిన ఆన్లైన్ విధానంలో వివరాలు నమోదు చేసి, నిర్ణీత రుసుము చెల్లించాలి. అనంతరం పరీక్షకు హాజరై అర్హత సాధించాల్సి ఉంటుంది. లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత నిర్దేశిత గడువు, విధి విధానాలకు అనుగుణంగా శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి కూడా సంబంధిత రుసుము చెల్లించి, అవసరమైన పరీక్షలు పూర్తి చేయాలి. ఈ తంతంగమంతా ప్రథమంగా ఆన్లైన్ కేంద్రాల్లో చేసుకోవాల్సి రావడంతో ఇదే అదనుగా కొందరు అధికారులతో కుమ్మకై ్కన దళారులు.. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి రూ.5,500 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. దరఖాస్తు నమోదు, స్లాట్ బుకింగ్, ఇతర సేవల పేరుతో ఈ సొమ్ము తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్కు రూ.420, చలానా రూ.1,260 మాత్రమే చెల్లించాలి. అయితే ప్రైవేటు కేంద్రాలు ఆ రుసుమును రూ.1700 వరకు తీసుకోవచ్చు. దానికి మించి అదనంగా తీసుకోవడంతో వాహనదారులు మోసానికి గురవుతున్నారు.
అవగాహన అవసరం
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు, దానికి చెల్లించాల్సిన రుసుముపై అవగాహన పెంచుకోవడం అవసరం. అధికారిక రవాణాశాఖ వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అవసరమైన పత్రాలు, చెల్లించాల్సిన రుసుము, పరీక్షల విధానం, స్లాట్ బుకింగ్ తదితర వివరాలను ముందుగానే పరిశీలించవచ్చు. ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయించేవారు కూడా చెల్లించిన ప్రతి మొత్తానికి రశీదు తీసుకోవాలి.


