సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
● నిడదవోలులో కొనసాగుతున్న విభేదాలు
● రేండేళ్ల వియోత్సవానికి టీడీపీ డుమ్మా
● టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి
నిడదవోలు: నియోజకవర్గ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పట్టణంలో లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటు జనసేన అభ్యర్థికి కేటాయించినప్పటి నుంచి వారి విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు సిఫారసు చేస్తున్న పనులకు కనీసం రూ.లక్ష కూడా కేటాయించకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం సహజమైపోయింది. కూటమి విజయోత్సవాల్లో సైతం మాజీ ఎమ్మెల్యే శేషారావుతో పాటు టీడీపీ వారు హాజరుకాకపోవడంతో నియోజకవర్గంలో అసలు పొత్తు ధర్మం పాటిస్తున్నారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వత్రోత్సవాలకు శేషారావుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు హాజరుకాకపోవడం గమనార్హం. పట్టణంలోని పాటిమీద సెంటర్‌లో అన్న క్యాంటిన్ పునఃప్రారంభానికి సైతం ఆ వర్గీయులు డుమ్మా కొట్టారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాత్రం మూడు పార్టీలు ఎప్పటికీ కలిసే ఉంటాయని ప్రచారం చేసుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలతో మొదలై..
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈ సీటు కేటాయించినప్పుడే టీడీపీ, జనసేన మధ్య గొడవలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే బూరుగు పల్లి శేషారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. అప్పటికి ఏదో సర్దుబాటు జరిగినా ఆనక దుర్గేష్ గెలిచి మంత్రి పదవి వచ్చాకా కూడా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. జనసేన వైఖరిపై ఆగ్రహించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు తన పదవికి సైతం రాజీనామా చేశారు. అధిష్టానం జోక్యంతో ఆయన తిరిగి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు..
కోటసత్తెమ్మ ఆలయ ట్రస్టు బోర్డుపై ప్రభావం
టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గపోరుతో పాటు సమన్వయ లోపంతో రాష్ట్రంలోనే పేరుగాంచిన కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టుబోర్డు నియామకం చేపట్టకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు కుర్చుని పరిష్కరించుకునే సమస్యలు సైతం పెండింగ్‌లో ఉంటున్నాయి. 2024 డిసెంబర్‌లో ఆలయ ట్రస్టు బోర్డు పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కూటమి అధికారం చేపట్టి రెండేళ్లైనా ఆలయ ట్రస్టు బోర్డును నియమించకపోవడంతో ఇరు పార్టీల్లో ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కుమ్ములాటల్లో ఆలయాన్ని గాలికి వదిలేశారనేంత వరకు విమర్శిస్తున్నారు.
మరోసారి నేనే పోటీ చేస్తా..
పట్టణంలో లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభలో మంత్రి కందుల దుర్గేష్ ఆశక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. వచ్చె రెండు పర్యాయాలు కూడా నేను నిడదవోలు నుంచి పోటీ చేస్తాననడం మళ్లీ చర్చనీయాంశమైంది. కందుల దుర్గేష్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేస్తారనే ప్రచారానికి ఆయన తెర దించడంతో టీడీపీలో అంతర్మధనం ప్రారంభమైందని జనసేన నేతలు బాహాటంగానే చెప్తున్నారు.
శేషారావు ఫ్లెక్సీల తొలగింపుతో..
మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భాగంగా కూటమిలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. జనసేన నేతలు పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఉన్న శేషారావు ఫ్లెక్సీలను తొలగించారు. ఇది మళ్లీ వారి మధ్య తీవ్ర వివాదం సృష్టించింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంక టేశ్వరరావు పార్టీ కార్యకర్తలతో కలసి శేషారావు చిత్రంతో ఉన్న ఫ్లెక్సీలతో ఓవర్ బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది తొలగించిన శేషారావు చిత్రపటాలను గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో పడవేసి నిరసన తెలపడం దుమారం రేపింది.


