కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మనస్తాపంతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ వంశీ (33) మృతదేహం శనివారం లభ్యమైంది. పెళ్లి విషయంలో వేరే మహిళతో వాగ్వాదం అనంతరం, వంశీ శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, ఇంక జీవించలేనని, గోదావరిలో దూకేస్తున్నానంటూ చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వంశీ మృతదేహం స్థానిక దోభీ ఘాట్ వద్ద ఉన్న గోదావరి నదిలో కనిపించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టంనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బుల్లెట్ నుంచి మంటలు
అంబాజీపేట: స్థానిక నాలుగు రోడ్ల సెంటర్‌కు సమీపంలో సూర్యప్రభ డెంటల్ హాస్పిటల్ వద్ద శనివారం బుల్లెట్ నుంచి ఆకస్మికంగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ హాస్పటల్ వైద్యుడు బిల్ల నీరజ్‌కుమార్‌కు చెందిన బుల్లెట్‌ను బయట నిలుపుదల చేశారు. బుల్లెట్ నుంచి మంటలు వస్తున్నాయని బయట నుంచి స్థానికులు కేకలు వేశారు. దాంతో ఆ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, నీరజ్‌కుమార్‌లు ప్రయత్నించారు. కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఫైర్ ఫోమ్‌ను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
రేపు కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
కొత్తపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీ 2008, 1998 ఎస్‌జీటీ మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తెలిపారు. ఆ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ – 2008 ఎస్‌జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 196 మంది ఉపాధ్యాయులకు, డీఎస్‌సీ– 1998 ఎస్‌జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 184 మంది ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ సమగ్ర శిక్ష మీటింగ్ హాల్ నందు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. డీఈఓఈజీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్ నందు పొందుపరిచిన జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.


