1901 జూలై 15న జన్మించిన రామచంద్రపురం పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ చెలికాని రామారావు కాకినాడ నుంచి 1952లో పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. అంతకు ముందు జాతీయోద్యమంలో చేరి స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఆ క్రమంలో 1922లో జైలు జీవితాన్ని సైతం గడిపారు. 1985 సెప్టెంబర్ 25లో మరణించే వరకూ ప్రజల మనిషిగా, ప్రజా వైద్యుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు డాక్టర్ చెలికాని స్టాలిన్.. తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారు. నాన్న బాటలోనే పయనిస్తూ, ప్రజా వైద్యుడిగా రాణించారు. రిక్షా కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు ఆయన ఆసుపత్రి వద్ద బారులు తీరి చికిత్స పొందేవారు. ఇప్పటికీ ఓపిక మేరకు వైద్య సలహాలు ఇస్తూనే ఉన్నారు. తండ్రి పేరున డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ స్థాపించి రామచంద్రపురం కేంద్రంగా సాహిత్య కృషి చేస్తున్నారు. తండ్రి జీవిత చరిత్రతో పాటు అనేక సామాజిక అంశాలపై పుస్తక రచన, ప్రచురణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. సాహిత్య సదస్సులకు హాజరవుతూ నేటి తరానికి, తన తండ్రి రామారావు తరానికి వారధిగా నిలుస్తున్నారు.
సమాజమే ఇల్లు
ఆలమూరుకు చెందిన హోమియో వైద్యుడు, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ చల్లా వెంకట్రావు పలు రంగాల్లో విశేషంగా శ్రమించారు. మండపేట పట్టణానికి చెందిన ఆయన కుమారుడు, ప్రముఖ హోమియో వైద్యుడు చల్లా రవికుమార్ తన తండ్రి వెంకట్రావు బాటలో హోమియో వైద్యుడిగా, సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుకు సాగుతున్నారు. తన తండ్రితో తాను గడిపిన రోజులు తక్కువ అని, నాన్న ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ గడిపేవారని రవికుమార్ తెలిపారు. అలా ఉండటాన్ని తొలి రోజుల్లో తాను బాధపడ్డానని, దానికి గల కారణాలను నాన్న ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించానన్నారు. సమాజాన్నే ఇల్లు అనుకున్నప్పుడు తాను దూరంగా ఉన్నా నీకు దగ్గరగానే కనిపిస్తాననేవారన్నారు. తన తండ్రి వె వెంకట్రావు మరణానంతరం ఆయన పేరున, ఆయన మెచ్చిన సామాన్య ప్రజల పక్షాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నానన్నారు.
సాహిత్య సేవకులు
అద్దేపల్లి రామ్మోహనరావు కాకినాడకు చెందిన ప్రముఖ కవి, రచయిత. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం, అభ్యుదయ విప్లవ కవిత్వం – సిద్ధాంతాలు – శిల్పరీతులు వంటి పేరు మోసిన కవితా సంపుటాలెన్నో వెలువరించారు. శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరుతో శ్రీశ్రీ కవితలలోని సారాంశాన్ని రచించారు. లెక్కలేనన్ని సాహిత్య సమావేశాలు నిర్వహించారు. ఆయన కుమారులు ప్రభు, ఉదయ భాస్కరరావు, రాధాకృష్ణ వెంకటరమణ సాహిత్య కృషిలో నాన్న బాటలో పయనిస్తున్నారు. నాన్నతో కలిసి అమలాపురంలో నిర్వహించిన మినీ కవితల సదస్సుకు తాను వెళ్లినప్పుడు అక్కడ మరో గొప్ప ప్రజా కవి అలిశెట్టి ప్రభాకర్‌తో గడిపానని అద్దేపల్లి ప్రభు అన్నారు. ప్రతి కవితా శ్రమజీవుల జీవన రేఖ కావాలని నాన్న చెబుతుండేవారని, అందుకే తాను రాసే ప్రతి పదమూ సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండేట్టు జాగ్రత్త పడుతుంటానన్నారు. తన సోదరులు ఉదయ భాస్కరరావు వ్యక్తిత్వ వికాసం మనస్తత్వ రంగాల్లో పుస్తకాలు రాశారని, వెంకట రమణ కవిత్వం, కథా రచనలో కృషి చేస్తున్నారని, అందరికీ నాన్నే స్ఫూర్తి అని ప్రభు అంటున్నారు.
● జీవితానికి భరోసా నాన్న
● గమనానికి వెలుగు రేఖ
● సమాజానికి దిక్సూచి
● నేడు ఫాదర్స్ డే
అద్దేపల్లి
రామ్మోహనరావుతో ఆయన
కుటుంబ
సభ్యులు


