నీట్‌ పరీక్ష కేంద్రం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్ష కేంద్రం పరిశీలన

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నీట్‌ (యూజీ)2026 రీ ఎగ్జామినేషన్‌ను పారదర్శ కంగా, ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ శివరాముడు అన్నారు. ఆదివారం ఆ పరీక్ష జరగనున్న ఎస్‌కేవీటీ డిగ్రీ ప్రభుత్వ కళాశాలను శనివారం ఆయన పరిశీలించారు. తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, సూచిక బోర్డులు, కూర్చునే సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ద్వారకా తిరుమలకు

పోటెత్తిన భక్తులు

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో శనివారం ద్వారకాతిరుమలలోని చిన వెంకన్న ఆలయ రద్దీగా మారింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు, అన్నదాన సదనం, కల్యాణకట్ట తదితర విభాగాలు కిటకిటలాడాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది.

గుండెపోటుతో

సచివాలయ ఉద్యోగి మృతి

ధవళేశ్వరం: రాజమహేంద్రవరం అర్బన్‌ పరిధి శంభూనగర్‌ సచివాలయంలో వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న ధవళేశ్వరానికి చెందిన నిమిషకవి దేవీ వరప్రసాద్‌ (37) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధవళేశ్వరంలోని నివాస గృహంలో వర ప్రసాద్‌ పార్దివదేహానికి కలెక్టర్‌ కీర్తి చేకూరి, జాయింట్‌ కలెక్టర్‌ మేఘాస్వరూప్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు,సచివాలయ ఉద్యోగులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు.

కారుమూరి సునీల్‌

అరెస్ట్‌ అక్రమం

పెరవలి (కొవ్వూరు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్‌ అక్రమ అరెస్ట్‌ దారుణమని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్‌ ధ్వజమెత్తారు. కొవ్వూరు ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్‌ బుక్‌ పాలనలో భాగంగా వైఎస్సార్‌ సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నారు. యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చౌటుపల్లి వీరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మద్యం కేసులు బనాయిస్తున్నారన్నారు. అసలు మద్యం అక్రమాలు కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. వీధికో బెల్టు షాపు ఏర్పాటు చేసి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని, బాటిళ్లపై అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

‘అన్నదాత’ నిధులు

రూ.88.64 కోట్ల విడుదల

రాజమహేంద్రవరం సిటీ: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలోని 1,33,156 మంది రైతులకు రూ.88.64 కోట్ల మేర తొలి విడత సాయం అందిందని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. రాజానగరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో రుడా చైర్మన్‌ బొడ్డు వెంకట రమణతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement