సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల దేవదాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తుల్లో సుమారు 70 శాతం మంది సమీప దేవాలయాలను కూడా దర్శించుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిది ప్రముఖ దేవాలయాలతో పాటు ఘాట్లకు సమీపంలోని మరో 543 ఆలయాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 162 ఆలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయి 43 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా వివిధ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్, మహేష్, సీఐ శ్రీనాథ్, దేవదాయ శాఖ అధికారులు వి.త్రినాథ్‌రావు, టి.దుర్గేష్, డి.ఎల్.వి.రమేష్‌బాబు, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఈ.వి.సుబ్బారావు, ఏలూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎస్. హరి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్


