రంగంపేట: మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం విద్యా ప్రస్థానంలో అరుదైన ఘనత సాధించింది. తండ్రి, తల్లి, కుమార్తె ముగ్గురూ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. గ్రామానికి చెందిన కారి దాసు, ఆయన భార్య ప్రభావతి, కుమార్తె మేఘన మే నెలలో జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షలను రాజమహేంద్రవరం సమీపంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో రాశారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ముగ్గురూ విజయం సాధించారు. కారి దాసు 291 మార్కులతో సెకండ్ క్లాస్, ప్రభావతి 208 మార్కులతో థర్డ్ క్లాస్, కుమార్తె కారి మేఘన 330 మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. విద్యకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు కూడా చదువు కొనసాగించి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం పలువురి ప్రశంసలు అందుకుంది.
ఇంటర్‌లో ఉత్తీర్ణులైన దాసు, ప్రభావతి, మేఘన


