సమస్యల్లోకి లాగేసారూ.. | - | Sakshi
Sakshi News home page

సమస్యల్లోకి లాగేసారూ..

Jun 20 2026 12:19 AM | Updated on Jun 20 2026 12:19 AM

అక్షర దీపాన్ని వెలిగించే దైవ స్వరూపం గురువు.. అజ్ఞానపు చీకట్లను తరిమేసి, విద్యార్థి జీవితానికి అర్థాన్ని నేర్పే తొలి సారథి ఆయనే.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సారాన్ని బోధించే ఉన్నతజీవి.. జీవించే విధానాన్ని నేర్పించే గురువు గురించి ఎంత వర్ణించినా తక్కువే..

అలాంటి ఉపాధ్యాయులనూ చంద్రబాబు ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలోనూ వారికి భరోసా దక్కకుంది.

కపిలేశ్వరపురం: సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులనూ చంద్రబాబు ప్రభుత్వం సమస్యల్లోకి తోసింది. తమ సమస్యలు పరిష్కరించాలని గత విద్యా సంవత్సరంలో గురువులు చేసిన ఉద్యమాలనూ పట్టించుకోకుండా వదిలేసింది. కనీసం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైనా తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని ఉపాధ్యాయులు నిట్టూర్పు వదులుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,570 ప్రభుత్వ పాఠశాలలకు గానూ, 18,316 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 962 ప్రభుత్వ పాఠశాలల్లో 5,814 మంది, కాకినాడ జిల్లాలోని 1,246 పాఠశాలల్లో 6,493 మంది, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,562 పాఠశాలల్లో 4,109 మంది, పోలవరం జిల్లాలో 800 ప్రభుత్వ పాఠశాలల్లో 1,900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులను ఆకట్టుకునేందుకు వారికి కూటమి నేతలు పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. అధికారం చేపట్టి రెండేళ్లయినా సీపీఎస్‌ రద్దు చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. కనీసం హామీకి కట్టుబడి రద్దు చేస్తామన్న భరోసా కూడా ఇవ్వడం లేదు. 12వ పీఆర్సీ కమిషన్‌ నియమించ లేదు. 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) విడుదల చేయాలన్న డిమాండ్‌ను ఖాతలు చేయలేదు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను నేటికీ ఇవ్వలేదు. ఉద్యోగుల పెన్షనర్ల బకాయి చెల్లింపులకు ఇప్పటి వరకూ రూప్‌ మ్యాప్‌ ప్రకటించలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైరైన రోజే పెన్షనరీ బెనిఫిట్‌లు చెల్లిస్తామన్న హామీ నీటి మీద రాత అయ్యింది. హెల్త్‌ కార్డు, మెడికల్‌ బిల్లుల చెల్లింపుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2004 ముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్‌ 57 ప్రకారం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

సమస్యలు ఎన్నో..

2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణ నుంచి పరీక్షలు, మూల్యాంకనం, ఉపాధ్యాయ శిక్షణ తరగతుల నిర్వహణ సమస్యలమయమైంది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం జెడ్పీ హైస్కూల్‌లో ఈ నెల 7న 1, 2 తరగతులు బోధించే సెకండ్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై పని ఒత్తిడిని పెంచడం, బోధనేతర పనులను అప్పగించడంతో మానసిక క్షోభకు గురవుతున్నారు.

గత విద్యా సంవత్సరంలో ఉద్యమాలిలా..

యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌, పీఆర్‌టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అనేక మార్లు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎస్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమహేంద్రవరంలలోని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేశారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనం విధానాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 5న ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించగా, ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివెళ్లారు. యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం ‘ఉపాధ్యాయ రణభేరి’ పేరుతో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఫిబ్రవరి 17న చలో విజయవాడను విజయవంతంగా చేపట్టింది. ఈ ఏడాది మార్చి 3న ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట, ఏప్రిల్‌ 1న యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్‌ వద్ద, ఏప్రిల్‌ 21న పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

వారిచ్చిన హామీలే అవి!

ఉపాధ్యాయులు ప్రభుత్వం ముందు ఉంచినవన్నీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలే. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా అమలు చేస్తారని చూస్తున్నాం.

– పి.సురేంద్రకుమార్‌, జిల్లా కార్యదర్శి,

యూటీఎఫ్‌ జిల్లా కమిటీ, కాలేరు

గురువుల గోడు వినని సర్కారు

హామీలను విస్మరించిన

చంద్రబాబు ప్రభుత్వం

ఉద్యమాలు చేస్తున్నా పట్టని వైనం

కొత్త విద్యా సంవత్సరంలోనూ

దక్కని భరోసా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement