కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉద్యోగం పేరుతో ఎర వేశాడు.. ఆశ పడిన వారిపై వల విసిరాడు.. లక్షల రూపాయలు వసూలు చేశాడు.. అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చాడు.. చివరకు జాడ లేకుండా మాయమయ్యాడు.. ఆ మోసగాడు ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్ నకిలీదని తేలడంతో బాధితులు గొల్లుమంటున్నారు. వివరాలివీ..
విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన కొచెర్ల వెంకటేశ్వరరావుకు సికింద్రాబాద్ చిరునామాతో ఉన్న ఓ కన్సల్టెన్సీ పేరిట 90309 12837 నంబర్ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించి వాట్సాప్ మెజేజ్‌లు వచ్చేవి. గత ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీలు భర్తీ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కొచెర్ల వెంకటేశ్వరరావుకు మెసేజ్ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సింగ్ విభాగంలో పని చేస్తున్న తన తమ్ముడి భార్య లక్ష్మికి అతడు ఈ మెసేజ్ చూపించాడు. దీంతో, ఆశ కలిగి ఆ నంబరులో సంప్రదించారు. తన పేరు వెంకటేశ్వరావు అని, విజయవాడలో ఉంటామని అవతలి వ్యక్తి (నిందితుడు) చెప్పాడు. విశాఖపట్నంలో 2, రాజమహేంద్రవరంలో ఒకటి చొప్పున జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపాడు. జీతం నెలకు రూ.38 వేల నుంచి రూ.48 వేల వరకూ వస్తుందని ఎర వేశాడు. ఈ ఉద్యోగం కావాలంటే రూ.8 లక్షలు ఖర్చవుతుందని, తనను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో కలవాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితులు ఈ నెల 9న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఆ మోసగాడికి ఫోన్ చేశారు. దీంతో, మార్చురీ నుంచి ఒకరు, బ్లడ్ బ్యాంక్ నుంచి మరొకరు వచ్చి బాధితులను కలిశారు. అనంతరం, ప్రభుత్వ అఽధికారిక వెబ్‌సైట్ అయిన హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో లక్ష్మి వివరాలు నమోదు చేసి, 4291 నంబర్‌తో ఎంప్లాయీ ఐడీ కూడా చూపించారు. రాజమహేంద్రవరంలో ఉద్యోగం వచ్చేసిందని చెప్పారు. ఆ మాటలు నమ్మిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు ఆ మోసగాడి చేతికి రూ.7.50 లక్షల నగదు ఇచ్చారు. నిందితుడి భార్య కురుకు సంతోషి పేరుతో ఉన్న నంబర్‌కు మరో రూ.50 వేలు ఫోన్‌పే చేశారు. డబ్బులు చెల్లించిన అనంతరం, ఉద్యోగం వస్తుందని నమ్మకమేమిటని ప్రశ్నించగా ఆ మోసగాడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేరిట రూ.8 లక్షలకు కె.సంతోషి సంతకంతో ఉన్న ఓ చెక్ కూడా వారికి ఇచ్చాడు. దీంతో, అతడిని వారు పూర్తిగా నమ్మారు. అనంతరం, వారిని ఆ మర్నాడు రమ్మని ఆ మోసగాడు చెప్పాడు. ఆ మేరకు అతడిని వారు ఆ మర్నాడు కలిశారు. సీఎం చంద్రబాబు ఫొటో, ప్రభుత్వ లోగోతో ఉన్న అపాయిట్‌మెంట్ లెటర్, సర్వీస్ రిజిస్టర్‌ను వారి చేతిలో ఆ మోసగాడు పెట్టాడు. అయితే, మొదట్లో జరిగిన చర్చల్లో తమకు విశాఖపట్నంలో పోస్టింగ్ కావాలని బాధితులు కోరారు. ఈ నేపథ్యంలో బాధితుడు మరో ఎత్తు వేసి, వారిని బురిడీ కొట్టించాడు. విశాఖపట్నంలో ఎంపికై న వారు జాయి్ అవడం లేదని, వెంటనే కేజీహెచ్‌కు వెళ్లాలని, తాను మధ్యలో కలుస్తానని లక్ష్మికి, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో, వారు ఆనందంగా విశాఖపట్నం బయల్దేరారు. మార్గం మధ్యలో ఆ మోసగాడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో, అనుమానం వచ్చిన వారు రాజమహేంద్రవరంలోని వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో, ఆ ప్రబుద్ధుడు చేసిన మోసం బట్టబయలైంది. లక్ష్మికి అతడు ఇచ్చిన నియామక పత్రాన్ని, సర్వీస్ రిజిస్టర్‌ను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని నిర్ధారించారు. ఈ మేరకు బాధితులు గురువారం స్థానిక త్రీటౌన్ పోలీసులను ఫిర్యాదు చేశారు. సీఐ వి.అప్పారావు వారిచ్చిన ఫోన్ నంబర్ ప్రకారం వివరాలు సేకరించారు. అందులో నిందితులు అనంతపురానికి చెందిన వనం నాగరాజు, వనం రామానుజమ్మగా గుర్తించారు.
జీఎన్‌ఎం పోస్టు ఇస్తామంటూ ఎర
రూ.8 లక్షల వసూలు
నకిలీ అపాయింట్‌మెంట్
లెటర్ అందజేత
నిజం తెలిసి గొల్లుమంటున్న బాధితులు


