గిరిజనానికి నీరాధనం.. | - | Sakshi
Sakshi News home page

గిరిజనానికి నీరాధనం..

Jun 18 2026 12:35 AM | Updated on Jun 18 2026 12:35 AM

రంపచోడవరం: ఏజెన్సీలో సహజసిద్ధంగా లభించే జీలుగు నీరా ద్వారా గిరిజనులు ఆదాయం పొందేలా పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ఫుడ్‌ సైంటిస్టు డాక్టర్‌ పీసీ వెంగయ్య కృషి చేస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే తాటిపై పరిశోధనలు జరుగుతుండగా ఏజెన్సీలో విస్తరంగా లభించే జీలుగు చెట్ల నుంచి నీరా సేకరణపై ఆయన దృష్టి సారించి సత్ఫాలితాలు సాధించారు. తాడిచెట్ల కంటే జీలుగు చెట్లు నుంచి ఎక్కువ మొత్తంలో నీరాను సేకరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జీలుగు నీరా నుంచి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులను తయారు చేయించి పాలగెడ్డ గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపేందుకు ప్రయోగత్మకంగా చర్యలు చేపట్టారు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మరికొన్ని గ్రామాల్లో ఈ ఉత్పత్తుల తయారీకి కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రెండు నెలల్లో పది వేల లీటర్ల నీరా

పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో రెండు దశాబ్దాలుగా తాటి ఉత్పత్తులపై వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి. తాటి జాతికి చెందిన జీలుగు నీరా ద్వారా ఆహార ఉత్పత్తులు తయారు చేసేందుకు హెచ్‌ఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త వెంగయ్య క్షేత్రస్థాయిలో జీలుగు నీరా సేకరించి సిరప్‌, బెల్లం, బెల్లం పొడిని తయారు చేశారు. ఏజెన్సీలో దాదాపు లక్ష వరకు జీలుగు మొక్కలు ఉంటాయని అంచనా. సాధారణంగా గిరిజనులు జీలుగు చెట్ల నుంచి కల్లు మాత్రం సేకరించి విక్రయిస్తారు. నీరా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పడంతో నీరా సేకరణపై వారు దృష్టి పెట్టారు. ఈ ఏడాది గుర్తేడు మండలం పాలగెడ్డ గ్రామానికి చెందిన 17 మంది గిరిజనులతో ప్రయోగాత్మకంగా నీరా సేకరణ చేయించారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు పది వేల లీటర్ల నీరాను సేకరించి బెల్లం, బెల్లం పొడి, సిరప్‌ తయారు చేశారు. కిలో బెల్లాన్ని రూ.800కు, సిరప్‌ 500 ఎంఎల్‌ను రూ. 300కు విక్రయించారు. హెచ్‌ఆర్‌ఎస్‌ ద్వారానే మార్కెట్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు రంపచోడవరం, మారేడుమిల్లి, గుర్తేడు మండలాల్లో 28 గ్రామాల్లో గిరిజనులకు నీరా సేకరణ, బెల్లం, సిరప్‌ తయారీపై శిక్షణ ఇచ్చారు. వచ్చే సీజన్‌కు శిక్షణ పొందిన గిరిజనుల ద్వారా పూర్తిస్థాయిలో జీలుగు నీరా సేకరించి ఆహార ఉత్పత్తుల తయారీకి హెచ్‌ఆర్‌ఎస్‌ ప్రణాళికలు సిద్ధిం చేస్తోంది.

ఎందుకు అంత డిమాండ్‌

జీలుగు బెల్లంలో (జీఐ) గ్‌లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల సాధారణ మధుమేహ రోగులు పంచదార, బెల్లానికి బదులుగా వాడవచ్చు. అలాగే జీలుగు బెల్లంలో ఖనిజ లవణాలు ఫాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి కల్తీకి అవకాశం లేకపోవడంతో జీలుగు బెల్లానికి ఎక్కువ డిమాండ్‌ ఉంది. దేశంలో ఎక్కడా జీలుగు నీరా నుంచి ఆహార పదార్థాలు తయారు కావడం లేదు. కేవలం ఈ ప్రాంతంలోనే వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.

నాటిన ఆరేళ్లలో ఆదాయం

జీలుగు మొక్కలు నాటిన ఆరేళ్ల కాలంలో దిగుబడి ఇ స్తాయి. రోజుకు 30–40 లీటర్లు మధ్య నీరాను సేకరించవచ్చు. ఈత, తాటి కంటే ఎక్కువ మొత్తంలో నీరాను జీలుగు చెట్ల నుంచి సేకరించవచ్చు. వంద లీటర్ల నీరాను ఉడికించడం ద్వారా 15 కిలోల వరకు బెల్లం తయారవుతుంది. ఏజెన్సీలో విరివిగా లభించే జీలుగు నీరా నుంచి గిరిజనులు ఆదాయం పొందేలా ప్రణాళికలు అధికారులు రూపొందిస్తున్నారు. పాలగెడ్డ గిరిజనులు నిత్యం రెండు గంటల పాటు రెండు నెలలు కష్టపడితే రూ.2 లక్షలు ఆదాయం వచ్చింది.

జీలుగు నుంచి మరిన్ని ఉత్పత్తులు

బెల్లం, సిరప్‌ తదితర వస్తువుల తయారీ

పాలగెడ్డలో ప్రయోగాత్మకంగా చర్యలు

రానున్న సీజన్‌లో మరిన్ని

గ్రామాలకు విస్తరణ

గిరి పుత్రులను ప్రోత్సహిస్తున్న

హెచ్‌ఆర్‌ఎస్‌ శాస్త్రవేత్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement