పెరవలి: ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తే తప్పితే సాధారణ ఫిర్యాదులకు అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ఇక్కడ ఒక సమస్య ఉంది.. పలానా వారు ఈ సమస్యకు కారణమని రుజువులు, సాక్ష్యాలు చూపి ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించకపోవడానికి అధికార మదం తలకెక్కిన పలువురు చోటా మోటా నాయకులేనని చెప్పక తప్పదు. వివరాల్లోకి వెళితే కానూరు అగ్రహారంలో కొంత కాలంగా పంట భూములను రొయ్యల చెరువులుగా తవ్వేస్తున్నారు. రాత్రిపూట చెరువు తవ్వకాలు మొదలుపెట్టగా ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ఆ తవ్వకాలను చూసి ప్రశ్నించగా ఎవరికివ్వాల్సిన మామూళ్లు వారికిచ్చాం.. దిక్కున్న చోట చెప్పుకోండని తవ్వకాలు జరుగుతున్న భూ యజమాని బదులిచ్చారు. దీంతో ఆ రైతులు గ్రామంలోకి వెళ్లి మరికొందరిని తీసుకువచ్చారు. వచ్చేటపుడు వారితో పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంకొక్క అంగుళం తవ్వినా సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక సదరు యజమాని తవ్వకాలను ఆపారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు కె.నిరంజన్ హుటాహుటిన క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దీంతో రైతులు, మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పురుగుమందు డబ్బాలు చూపిస్తూ వెంటనే చెరువును పూడ్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆయన వెంటనే చెరువులను ధ్వంసంచేయాలని, రెవెన్యూ, వీఆర్వో, ఆర్‌ఐ అక్కడే ఉండి చెరువు పూడుస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తనకు పంపాలని ఆదేశించారు. ఎవరైనా అడ్డుకున్నా, ఎదురు తిరిగినా పొక్లెయిన్లను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పొక్లెయిన్ డ్రైవర్లు అక్కడి నుంచి జారుకోవడంతో అధికారులు వారికి ఫోన్ చేసి చెరువులను పూడుస్తారా.. పొక్లెయిన్లను సీజ్ చేయమంటారా అని హెచ్చరించారు. దీంతో చేసేది లేక వారు వచ్చి చెరువులను పూడ్చడం ప్రారంభించారు. పూడ్చివేత పనులు పూర్తయ్యే వరకు తాము వెళ్లేది లేదని రైతులు అక్కడే భీష్మించారు. కాగా ఇప్పటికే కానూరు అగ్రహారంలో సుమారు 15 ఎకరాల్లో రొయ్యల చెరువులను తవ్వినట్టు రైతులు తెలిపారు. ఈ చెరువులు తవ్వుతున్నవారు అధికార టీడీపీ వర్గీయులు కావడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల తవ్వకంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పటికప్పుడు పనులను అడ్డుకుంటున్నారు తప్ప పూడ్చివేత చర్యలు చేపట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిషేధాజ్ఞలు
చెరువుల తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని 2021లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. నాటి నుంచి 2024 వరకు ఒక్క చెరువు కూడా తవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఆ జీవోను రద్దు చేయలేదు కానీ రాజకీయ పలుకుబడితో గుట్టుగా చెరువు తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
2025లో పెరవలి మండలం కానూరు అగ్రహారంలో అక్రమంగా రాత్రిళ్ళు తవ్వకాలు చేపడితే స్దానిక రైతులు అడ్డుకుని తవ్వకాలను నిలుపుదల చేసారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 15 ఎకరాలు చెరువులుగా మారిపోవడంతో సరిహద్దు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు
పంట భూముల్లో చెరువుల తవ్వకానికి ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. కానూరు అగ్రహారంలో చెరువు తవ్వుతున్నారని ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నాం. అంతే కాకుండా చెరువును పూడ్చాలని ఆదేశాలిచ్చాం.
– కె.నిరంజన్, తహసీల్దార్, పెరవలి
పంట భూముల్లో
అక్రమంగా రొయ్యల చెరువు తవ్వకాలు
సరిహద్దు రైతుల ఫిర్యాదులకు
స్పందించని అధికారులు
ఆత్మహత్యలే శరణ్యమని
పురుగు మందు డబ్బాలతో నిరసన
ఆగమేఘాలపై వచ్చి పూడ్చివేతకు
ఆదేశించిన తహసీల్దార్
వైఎస్సార్ సీపీ హయాంలో
తవ్వకాలపై నిషేధాజ్ఞలు
ఏడాది కూటమి పాలనలో
యథేచ్ఛగా పంట భూముల ధ్వంసం


