గోదావరిలో మునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో మునిగి యువకుడి మృతి

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

కె.గంగవరం: మండలంలోని కోటిపల్లి రేవులో స్నేహితులతో కలసి స్నానానికి దిగిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కె.గంగవరం పోలీసుల కథనం ప్రకారం.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన జాగ్‌ దయాకర్‌ (18) తన స్నేహితులు కట్ట అభిషేక్‌, ఉడత శ్యామ్‌తో కలసి ఆదివారం కోటిపల్లికి వెళ్లారు. అక్కడి పుష్కర ఘాట్‌ వద్ద గోదావరిలో స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా, దయాకర్‌ గల్లంతయ్యాడు. వెంటనే గమనించిన స్నేహితులు గట్టుపైకి వచ్చి స్థానికులకు తెలపడంతో, వారు గోదావరిలో గాలించారు. సుమారు రెండు గంటల పాటు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా, దయాకర్‌ మృతదేహం లభించింది. కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి..

ఆత్రేయపురం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్రేయపురం ఎస్సై ఎస్‌.రాము కథనం ప్రకారం.. బొబ్బర్లంక గ్రామానికి చెందిన మోత గంగాధర్‌ (31) ఆదివారం ఉదయం 9 గంటల సమీపంలో గోదావరి నదిలో వేటాడుతుండగా, ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందాడు. దీనిపై అతని అన్నయ్య మోత వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

కాలువలో మత్స్యకారుడి గల్లంతు

పి.గన్నవరం: మొండెపులంక గ్రామం వద్ద ప్రధాన పంట కాలువలో ఆదివారం చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్‌.గన్నవరం శివారు జొన్నల్లంకకు చెందిన మత్స్యకారుడు చందాడి శ్రీనివాసరావు (45) ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. మొండెపులంక పాత వంతెన సమీపంలోని కాలువలో అతని వల నీటిలో రాయికి చిక్కుకుంది. దీంతో దానిని తొలగించేందుకు కాలువలోకి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రధాన పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన శ్రీనివాసరావుకు భార్య వరలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గోగన్నమఠం డ్రైన్‌లో..

మలికిపురం: గొల్లపాలెం గ్రామంలోని గోగన్నమఠం డ్రైన్‌లో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం స్థానిక ఓఎన్జీసీ బావుల సముదాయం వద్ద స్నేహితులతో కలసి ఆటలు ఆడుతుండగా, పక్కనే ఉన్న డ్రైన్‌లో బంతి పడడంతో దానిని తీసేందుకు గుండుమేను శ్రీరామ్‌ (16) దిగాడు. అతనికి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీరామ్‌ తండ్రి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు గుండుమేను శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement