ఏలూరు టౌన్: పోలీస్ వ్యవస్థలో నిందితులకు శిక్షలు విధించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనాలు కీలకమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిశోర్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శనివారం ఏలూరులో కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పోలీస్ అధికారులు దీనికి హాజరయ్యారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో దర్యాప్తు, కోర్టు విచారణల రిపోర్టుల తయారీలో ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏఐని వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించటం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏఐ టూల్స్ వినియోగించాలని కోరారు.
20 శాతం పెరిగిన కేసుల
పరిష్కారం
ఏలూరు జిల్లా ఎస్పీ శివ కిశోర్ మాట్లాడుతూ ధర్మా (డిజిటల్ హాలీస్టిక్ ఏఐ డ్రైవెన్ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్) యాప్‌ను రూపొందించటంలో స్మార్ట్ పోలీసింగ్‌కు కృషి చేశామన్నారు. ధర్మా యాప్ పోలీస్ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే కేసుల పరిష్కారం 20 శాతం పెరిగిందని, ఏకంగా 2,344 కేసులు పరిష్కారం కావటం విశేషమన్నారు. నేరాలకు సంబంధించి ఫొటోలు, సాక్ష్యాలు, చార్జిషీట్లు, ప్రకటనలు వంటి అంశాల్లో ఏఐ విశ్లేషణలతో దర్యాప్తులో కచ్చితత్వం మరింత పెరిగిందన్నారు.


