● సందడికి సిద్ధమైన ప్రభుత్వ పాఠశాలలు
● జిల్లాలో 93,849 మంది విద్యార్థులు
● ఇంకా చేరని విద్యామిత్ర కిట్లు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వేసవి సెలవులు ముగిశాయి. జిల్లాలోని విద్యాసంస్థలు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం బడి గంట మోగనుంది. పాఠశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల కేరింతలు, ఉపాధ్యాయుల బోధనలు, ఉదయపు ప్రార్థనలతో విద్యాలయాలు మళ్లీ కళకళలాడనున్నాయి. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల హాజరు పెంపు, పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే బోధన సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అయితే కీలకమైన విద్యామిత్ర కిట్లు ఇంకా పాఠశాలలకు చేరలేదు.
తగ్గిన ప్రవేశాల సంఖ్య
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,126 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 843 ప్రాథమిక పాఠశాలలు, 44 అప్పర్ ప్రాథమిక పాఠశాలలు, 261 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 93,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధికారులు పలు సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీటిని విద్యార్థులు, తల్లిదండ్రులకు చూపిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి పెరిగిలా ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనాల పరిశుభ్రత, తరగతి గదుల మరమ్మతులు, బెంచీలు, డెస్కులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి పనులను వేగవంతం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో భవనాల భద్రత, విద్యుత్ సదుపాయాలపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గిపోయింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యాలయాల వైపు పరుగులు పెడుతున్నారు.
జగన్ ప్రభుత్వంలో పాఠశాలలకు కొత్తరూపు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక రూపును సంతరించుకున్నాయి. తరగతి గదుల అభివృద్ధి, స్మార్ట్ టెలివిజన్లు, డిజిటల్ బోధన, మెరుగైన ఫర్నిచర్, ప్రహరీలు, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడం విశేషం.
ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు శాతం పెంపు, డ్రాప్‌అవుట్ల నివారణ, నాణ్యమైన విద్య అందించడం వంటి అంశాలకు విద్యాశాఖ ప్రాధాన్యం ఇస్తోంది.
ఇంకా రాని యూనిఫాం, స్కూలు బ్యాగులు, షూస్
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ మాత్రమే చేరాయి. వాటిని తొలిరోజే అందించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా విద్యార్థులకు యూనిఫాం దుస్తులు, స్కూలు బ్యాగులు, షూస్ ఇంకా రాలేదు. మొదటి రోజు నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా ఉపాధ్యాయులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఏఐ జెనరేటెడ్ చిత్రం


