పెరవలి(కొవ్వూరు): జిల్లాలో సేంద్రియ సాగుపై రైతులు దృష్టిపెట్టి సాగు విస్తీర్ణం పెంచి భూ పరిరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కొవ్వూరులో ఖేత్ బచావో అభియాన్‌లో బుధవారం ఆమె పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎరువుల పంపిణీలో ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ వంటి ఎరువులను విక్రయిస్తారని తెలిపారు. వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసి వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల ఖర్చులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 1,66,840 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ సీజన్ మొత్తం 33,289 మెట్రిక్ టన్నులు యూరియా, 6617 మెట్రిక్ టన్నులు డీఏపీ అవసరమవుతాయని తెలిపారు. జూన్ నెల వరకు 6,150 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం 9,837 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, అదనంగా ఈ నెలలో 8,330 మెట్రిక్ టన్నులు యూరియా జిల్లాకు చేరనున్నదని తెలిపారు. ఆర్‌ఎస్‌కే పరిధిలోని డీలర్లు మ్యాపింగ్, రైతుల ధ్రువీకరణ తదితర ప్రక్రియల ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ కె.ఆనందరావు, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ కీర్తి చేకూరి


