ప్రజలను మోసగించడమే
ప్రభుత్వ లక్ష్యం
ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. రైతులు పండించిన పొగాకు, ధాన్యం, మొక్కజొన్న, కోకో, ఇతర పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పొగాకు రైతులను ఆదుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు బయట పెట్టిన తర్వాతే గతేడాది చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.
– చెల్లుబోయిన వేణు,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
గిట్టుబాటు ధర కల్పించాలి
అప్పులు చేసి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. పొగాకు ఎక్కువ కాలం నిల్వ చేస్తే నాణ్యత దెబ్బతింటుంది. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకున్నాం. పెట్టుబడి సాయం అందించి ప్రోత్సహించాం.
– తానేటి వనిత, మాజీ మంత్రి,
గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి
రైతులకు మట్టే
చంద్రబాబు సీఎం పీఠంపై ఎప్పుడూ కూర్చున్నా రైతుల నోట్లో మట్టికొట్టే పరిస్థితులు వస్తున్నాయి. పొగాకు రైతుల కష్టం వర్ణించలేనిది. వేలం కేంద్రాల్లో ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించని పరిస్థితి. పొగాకుపై కేంద్రానికి ఏటా రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తున్నా రైతులను విస్మరిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే ఉద్యమిస్తాం.
–జక్కంపూడి రాజా,
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
నిరసన కార్యక్రమానికి హాజరైన రైతులు, నాయకులు, కార్యకర్తలు
రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో పార్టీ నేతలు
పొగాకు రైతులకు జగన్ అండ
2022లో పొగాకు సంక్షోభం ఏర్పడితే మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.500 కోట్లు విడుదల చేసి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. 2014లో ప్రతిపక్ష నేతగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించగా, మరుసటి రోజు కిలోకు రూ.20 ధర పెంచి కొన్నారు. ఇప్పుడు రైతుల వద్ద రూ.2,600 కోట్ల పొగాకు నిల్వలున్నాయి.
–తలారి వెంకట్రావు,
మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
రైతుల విశ్వాసం
కోల్పోయిన ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని కోల్పోయింది. గతేడాది కిలో పొగాకు రూ.453కు కొనుగోలు చేయగా, ఈ ఏడాది రూ.250 పలుకుతోంది. మొక్కజొన్న మద్ధతు ధర రూ. 2,400 ఉండగా, రూ.1,800కు కొంటున్నారు. రైతును ఆదుకోవడానికి డబ్బు లేదు కాని, అమరావతిలో అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
– జిన్నూరి రామారావు (బాబి),
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు
సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని నల్లరేగడి నేలల్లో పండిన పొగాకు కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు రోడ్డెక్కారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై సమరభేరి నిర్వహించారు. పొగాకు రైతులు చలో దేవరపల్లి కార్యక్రమంలో భాగంగా బుధవారం దేవరపల్లి టొబాకో బోర్డు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు బైఠాయించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పొగాకు బోర్డు మేనేజర్ సురేంద్రకుమార్‌కు అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాస్‌నాయుడు, పార్లమెంటరీ పరిశీలకులు టి.గురుమూర్తి రెడ్డి, గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులు చందన నాగేశ్వర్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, పొగాకు రైతు సంఘం ప్రతినిధులు సత్తి జగదీశ్వరరెడ్డి, గడా రాంబాబు, జగదీష్, నరహరిశెట్టి రాజేంద్రబాబు, సుధాకర్ పాల్గొన్నారు.
ఉత్పత్తి పెరిగినా కొనుగోళ్లు పెరగడం లేదు
జిల్లా వ్యాప్తంగా 12,612 మంది రైతులు 29,132 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. పొగాకు ఉత్పత్తి 85 మిలియన్ కిలోలకు పెరిగినా కేవలం 49.32 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేస్తామనడం దారుణం.
–డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ,
రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి
రైతులకు ఆత్యహత్యలే శరణ్యం
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఆత్మహత్య తప్ప వేరే మార్గంలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.
– సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి
గిట్టుబాటు ధరకు కొనాలి
బోర్డు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పండించిన పొగాకు గిట్టుబాటు ధర కిలోకు రూ.330 చెల్లించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. అరటికి బీమా వర్తింప చేసి నిడదవోలు నియోజకవర్గంలో రూ.11.50 కోట్ల పరిహారం అందించాం.
– జి. శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు
రైతుల సమస్యలపై
వైఎస్సార్ సీపీ సమరభేరి
నల్లరేగడి భూముల్లో పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్
దేవరపల్లి టొబాకో
వేలం కార్యాలయం వద్ద ధర్నా
జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన
వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు
కొనుగోళ్లు ప్రారంభించకపోతే
ఉద్యమిస్తామని హెచ్చరిక
టొబాకో బోర్డు మేనేజర్‌కు వినతి పత్రం


