మహిళలను వంచించి.. నిరసన ర్యాలీయా? | - | Sakshi
Sakshi News home page

మహిళలను వంచించి.. నిరసన ర్యాలీయా?

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

రాజకీయ లాభం కోసమే నిడదవోలు సభ

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వేణు ధ్వజం

రాజమహేంద్రవరం రూరల్‌: ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మహిళలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తిరిగి వారితో కలసి నిరసన ర్యాలీ చేయడమేమిటని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంలో ఈ ర్యాలీ ఎందుకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. నిడదవోలులో జరిగిన సభ, ర్యాలీ ప్రజల కోసం కాదని, రాజకీయ లాభం కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని చెప్పి, రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలు చేయలేదని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ‘సూపర్‌ హిట్‌’గా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, వాస్తవానికి వాటి అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా యువతను మోసగించారని అన్నారు. మూడు ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్ల హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని చెప్పారు. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో, వైఎస్‌ జగన్‌ పైన, గత ప్రభుత్వం పైన నిందలు వేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

అమరావతి ఒక్కటే చంద్రబాబు అజెండా

జిల్లాలో భూముల రేట్లు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమలు రావడం లేదని చంద్రబాబు అంటున్నారని వేణు చెప్పారు. వాస్తవానికి పరిశ్రమలకు అనువైన భూములు జిల్లాలో అనేకం ఉన్నాయని చెప్పారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకున్నప్పుడు, ఆ భూమి విలువైనదనే విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ‘మీకు ఎక్కడ లాభం వస్తే అక్కడ పరిశ్రమలు పెడతారు. కిక్‌బ్యాక్స్‌ ఇచ్చే ప్రాంతాల్లోనే పరిశ్రమలు పెడతారా?’ అంటూ నిలదీశారు. అమరావతి ఒక్కటే అజెండాగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

ధర్మదీక్షలు, ర్యాలీలతో

ఏం సాధించారు?

బీజేపీతో 2014–19లో విభేదించిన తరువాత చేసిన ధర్మదీక్షలతో చంద్రబాబు ఏం సాధించారని వేణు ప్రశ్నించారు. నేడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారన్నారు. ఎంతసేపూ రాజకీయాలు చేయడం తప్ప.. అభివృద్ధి, ప్రజల అవసరాలపై ఆలోచన చేయకుండా వ్యవస్థలన్నింటినీ కుప్ప కూల్చారని విమర్శించారు. పెరిగిన ధరలతో పేదలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు భద్రత కొరవడిందన్నారు. తాను చేసిన అవినీతి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్న ఏకై క ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ అని, వైఎస్‌ జగన్‌పై నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారనే భావనతో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందనే విషయాన్ని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారని తెలిపారు. ‘మీరు విధ్వంసం చేస్తూ వైఎస్‌ జగన్‌ పాలనను విధ్వంసం అని ప్రచారం చేస్తారా?’ అని మండిపడ్డారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయని, చంద్రబాబు ఇప్పటికై నా మారాలని, మిగిలిన మూడేళ్లలోనైనా చేసిన పనులు చెప్పుకోవాలని వేణు హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement