గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

రాయవరం: మండలంలోని వెదురుపాక గ్రామానికి చెందిన ఉపాధి కూలీ సత్తి వనుమురెడ్డి(74) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో చెరువులో పూడికతీత పనుల్లో పాల్గొన్న వనుమురెడ్డి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పని ప్రదేశంలో కుప్పకూలిపోయాడు. సహచర కూలీలు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీను ఈ విషయాన్ని ఏపీఓ జె.సుధారాణికి తెలపడంతో ఆమె ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వనుమురెడ్డి మృతి చెందడం పట్ల సహచర కూలీలు సంతాపం వ్యక్తం చేసి, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

కాల్‌మనీ వేధింపులపై ఫిర్యాదు

అంబాజీపేట: ఓ ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకున్న మహిళ సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఆమెతో పాటు చుట్టు పక్కల వారిని నానా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయ. అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన కె.భాగ్యలక్ష్మి ఐడీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.50 వేల రుణం తీసుకుని అంబాజీపేటలో బ్యూటీపార్లర్‌ నడుపుతున్నారు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించారు. ఆ తరువాత రూ.30 వేలు రుణాన్ని తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో కొంత గడువు కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా బ్యాంకు సిబ్బంది కాల్‌మనీ పేరుతో వేధింపులకు దిగారు. తనతో పాటు చుట్టూ ఉన్నవారికి ఫోన్‌ చేసి దుర్భాషలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో బాధితురాలు భాగ్యలక్ష్మి, ఇతర దుకాణాల యజమానులు సీఐ ఆర్‌.భీమరాజుకు, ఎస్సై షేక్‌ సుభానికి ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement