నేతన్నలకు అండగా ఉంటా : ఎమ్మెల్సీ తోట | - | Sakshi
Sakshi News home page

నేతన్నలకు అండగా ఉంటా : ఎమ్మెల్సీ తోట

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

కపిలేశ్వరపురం: చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లించే వరకూ తాను నేతన్నలకు అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత కార్మికులు ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌, ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట చేస్తున్న ఆత్మగౌరవ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తోట సందర్శించారు. చేనేత సంఘాల నాయకులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టడం ద్వారా వృత్తిని పరిరక్షించవచ్చన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికులు పట్ల వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమైనదన్నారు. ఓట్ల కోసం హామీలను ఇవ్వడం తప్ప మనస్ఫూర్తిగా చేనేత కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. చేనేత వృత్తి రక్షణకు మాజీ సీఎం ఎన్టీఆర్‌ పని చేశారన్నారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేనేత రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు సాయాన్ని అందజేశారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా చూపడంలేదని తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోటకు ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పప్పు దుర్గారమేష్‌, డాక్టర్‌ సమతం రమణ మహేష్‌, ఏపీ చేనేత సహకార సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జేఏసీ అల్లక రాజు, ఆత్మ గౌరవ దీక్షా నిర్వహణ కమిటీ కార్యదర్శి దొంతంశెట్టి సత్యప్రకాష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement