రత్నగిరికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

చైర్మన్‌గా ఐవీ రోహిత్‌

మరో 16 మంది సభ్యుల నియామకం

టీడీపీ నుంచి 13, జనసేన నుంచి రెండు,

బీజేపీ నుంచి ఒకరికి స్థానం

అన్నవరం: అన్నవరం దేవస్థానానికి ఎట్టకేలకు 17 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌బోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. గత ధర్మకర్తల మండలి పదవీకాలం గత ఏడాది ఏప్రిల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి. హరి జవహర్‌లాల్‌ జీఓ విడుదల చేశారు.

దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఐవీ రోహిత్‌ ఈ మండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయనతో కలిపి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నలుగురికి స్థానం లభించింది. ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఆరుగురు మహిళలకు స్థానం లభించింది. గోదావరి జిల్లాల నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, అనకాపల్లి జిల్లాల వారిని కూడా ట్రస్ట్‌బోర్డులో నియమించారు.

చైర్మన్‌ను మినహాయిస్తే 16 మంది సభ్యులలో 13 మంది టీడీపీ వారు కాగా, ఇద్దరు జనసేన, ఒకరు బీజేపీ వారు ఉన్నారు.

మండలి సభ్యులు వీరే

ఐవీ రోహిత్‌, చైర్మన్‌ (ప్రత్తిపాడు) కాగా, సభ్యులుగా పర్వత సూర్యారావు (శంఖవరం–ప్రత్తిపాడు), సూర్యభాస్కరం ధనేకుల (ప్రత్తిపాడు), కామర్స్‌ చిరంజీవిరావు సభ్యుడు (అన్నవరం), రావిపాటి సత్యేనారాయణ (గుంటూరు), పాలచర్ల నాగేంద్రబాబు (జగ్గంపేట), తూము అప్పారావు (పిఠాపురం), హెచ్‌ రామాంజనేయులు (ఎస్సీ) (మడకశిర), తేలుకుంట్ల అనంతమ్మ (ఒంగోలు), గెడ్డం అప్పారావు (బుజ్జి) (పాయకరావుపేట), గొడేటి భగవత్‌ (ఎస్టీ) (రంపచోడవరం), రెడ్డి ఎరుకమ్మ (మాడుగుల), ఇండుగబిల్లి లోవకుమారి (తుని), యరగాటపు బాబ్జీ (మండపేట), బండి లక్ష్మి (కై కలూరు), తోలేటి శిరీష (పిఠాపురం), తుల్లిమల్లి ఝాన్సీలక్ష్మి (గన్నవరం–కృష్ణా) నియమితులయ్యారు. వీరిలో గెడ్డం అప్పారావు, తోలేటి శిరీష జనసేన కాగా, కామర్స్‌ చిరంజీవిరావు బీజేపీ. మిగిలిన 13 మంది టీడీపీకి చెందినవారు.

దాతలకు దక్కని సభ్యత్వం

టీడీపీ, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాలు నియమించిన ధర్మకర్తల మండలిలో దాతలకు స్థానం కల్పించారు. కానీ ఈ సారి వారికి స్థానం దక్కలేదు. గతంలో పెద్దాపురానికి చెందిన పారిశ్రామికవేత్త, దాత, లలితా రైస్‌ మిల్లు ఎండీ మట్టే సత్యప్రసాద్‌ను నియమించారు. ఆయన స్వామి, అమ్మవారికి రూ.మూడు కోట్లతో వజ్ర కిరీటాలు చేయించారు. ఇలా పలు విధాల దేవస్థానానికి సేవలు చేశారు. అలాగే విశాఖకు చెందిన పారిశ్రామికవేత్త, దేవస్థానానికి 33 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన దాత ఎంఎస్‌ రెడ్డిని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సభ్యునిగా నియమించారు. ఈ సారి మండలిలోకి తీసుకోలేదు.

చినరాజప్పకు ఝలక్‌

అన్నవరం దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో పెద్దాపురం నుంచి ఒకరికి స్థానం దక్కేది. కానీ ఈసారి దక్కలేదు. సీనియర్‌ టీడీపీ నాయకుడు నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నుంచి ఎవరికీ స్థానం దక్కకపోవడం గమనార్హం. కాగా, తుని నుంచి గతంలో కనీసం ఇద్దరు సభ్యులు ఉండేవారు. ఈసారి ఒకరికే పరిమితం చేశారు. కాకినాడ నుంచి సైతం లేరు.

కాగా అన్నవరానికి సుమారు 400 కిలోమీటర్లు దూరంలో గల ఒంగోలు, 836 కిలోమీటర్ల దూరంలోని కర్నాటక సరిహద్దుల్లోని మడకశిరకు చెందిన నాయకులకు ట్రస్ట్‌బోర్డులో స్థానం కల్పించారు. వీరు మండలి సమావేశాలకు రాకపోకలు సాగించడానికే శ్రమపడాల్సి వస్తుంది. కాగా రెండు మూడు రోజుల్లో ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement