● ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ర్యాలి వంతెన
● పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన
ఆత్రేయపురం: ఏడు శతాబ్దాలకు ముందు నిర్మించిన ర్యాలి వంతెన శిథిలస్థితికి చేరి ఎప్పుడు కూలుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోరా? అంటూ పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. 1950 ప్రాంతంలో అప్పటి వాహనాల రద్దీ కనుగుణంగా నిర్మించిన వంతెన ఇప్పుడు ప్రయాణించే వాహనాల రద్దీని తట్టుకోలేకపోతోంది. ఇరుకుగా ఉండి, ఎదురుగా వాహనం వస్తే వంతెనపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ వంతెన రక్షణ గోడలు బీటలు వారి పూర్తిగా పాడయ్యాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాలు సైతం లేకపోవడంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే రహదారి సైతం ఇరుకుగా, అసౌకర్యంగా ఉంది.
రెండు లేన్‌లుగా అభివృద్ధి చేసేందుకు
గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు
ఈ వంతెన రహదారి అటు రాజవరం– పొదలాడ రాష్ట్రీయ రహదారిని ఇటువైపు అమలాపురం– బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారిని కలుపుతోంది. ఈ వంతెనపై పలు వాహనాల్లో నిరంతరం ఇసుక, ఇటుక రవాణా జరుగుతోంది. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఈ వంతెనను రెండు లేన్‌లుగా అభివృద్ధి చేసి రెండు రాష్ట్రీయ రహదారులకు కలపాలని నిర్ణయించారు. వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వ అనుమతిని సైతం పొందారు. ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు మరుగున పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఈ వంతెన నిర్మాణంపై దష్టి సారించ లేదు.
ప్రభుత్వం దృష్టి సారించాలి
ఈ వంతెన గురించి పలుమార్లు జిల్లా పరిషత్ సమావేశాలలో ప్రస్తావించాను. చంద్రబాబు ప్రభుత్వం వంతెన నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
– బోనం సాయిబాబు,
ఆత్రేయపురం
జెడ్పీటీసీ సభ్యుడు
ప్రతిపాదనలు పంపాం
1954లో ఊబలంక నుంచి ర్యాలి వెళ్లే రోడ్డులో దీన్ని సింగల్ లైన్ వంతెనగా నిర్మించారు. రెండు వరుసల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.9.00 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. – జి.రాజేంద్రప్రసాద్,
డీఈ, రోడ్లు భవనాల శాఖ, కొత్తపేట
వెంటనే నిర్మించాలి
ర్యాలి సుమారు 20వేల జనాభా గల అతి పెద్ద గ్రామం. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి ఆలయాలకు టూరిస్టులు వస్తున్నారు. వెంటనే వంతెనను నిర్మించాలి.
పి.ఎస్.ఆర్.జైపాల్, ర్యాలి, ఎంపీటీసీ సభ్యులు
భక్తులకు గోతుల దర్శనం
ర్యాలి గ్రామంలో 11 శతాబ్దం నాటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి నిత్యం వాహనాల్లో వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడే ఆలయాల కూడలికి వచ్చే సింగిల్ రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది.
ర్యాలి సమీపంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి వంటి జనసాంద్రత గల గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నిత్యం రైతులు అరటి గెలలను సైకిళ్లపై రావులపాలెం మార్కెట్ యార్డుకు తరలిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన పంచాయతీల పునర్వ్యవస్థీకరణలో ర్యాలి గ్రామం జిల్లాలోని అతిపెద్ద రూర్బన్ గ్రామంగా గుర్తించారు.


