గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత మహిళ, దళిత సంఘాల నేతల ఆందోళన
కాజులూరు: దళిత మహిళను కులం పేరుతో దూషించి అవమానించిన కాజులూరు జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తి (శ్రీరామ్) పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలంటూ గురువారం బాధిత మహిళతో కలసి పలువురు దళిత సంఘాల నేతలు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ సన్నపు లక్ష్మీ మాట్లాడుతూ తన భర్త కిరణ్, ఆకుల నాగదేవి భర్త నాయుడు, నామా సుబ్బారావు కలసి చేస్తున్న టైల్స్ వ్యాపారం లావాదేవీలలో తలెత్తిన వివాదంపై తమకు తగువు చెప్పాలని తానూ, ఆకుల నాగదేవి ఈ నెల తొమ్మిదవ తేదీ గురువారం గ్రామానికి చెందిన అన్యం శ్రీరామ్ ఇంటికి వెళ్లామన్నారు. అయితే అతను మహిళలమని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ కులంపేరుతో దూషించి ఇంటి నుంచి నెట్టివేశారన్నారు. దీనిపై ఈ నెల 11వ తేదీన కులసంఘాల నేతలతో వచ్చి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. అన్యం శ్రీరామ్ కూటమి పార్టీలో ఉన్న దళిత నాయకులతో ప్రెస్‌మీట్‌లు పెట్టించి తమపై తప్పుడు ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు ప్రేరేపిస్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మండల ఎస్సీ సెల్ కన్వీనర్ పోలినాటి సూర్యచంద్రం, బీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం, జేబీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు పత్తిపాటి బుల్లిరాజు, మాలమహానాడు అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు మాట్లాడుతూ తామంతా బాధితులకు బాసటగా ఉన్నామని, పోలీసులు తగిన చర్యలు తీసుకొనకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. దళిత నాయకులు పోతురాజు బాబురావు, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, బుల్లెట్ రాజు, పుల్లారావు పాల్గొన్నారు.


