అమలాపురం టౌన్: సమాజానికి వెలుగునిచ్చే విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా తయారైంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా గ్రంథాలయాల అభివృద్ధిని, నిధుల కేటాయింపును పట్టించుకోవడం లేదు. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు ఉమ్మడి జిల్లా పరిధిలోనే కొనసాగుతున్నాయి. అందులో గ్రంథాలయశాఖ ఒకటి. ప్రతి ఏటా రాష్ట్ర గ్రంథాలయాల బడ్జెట్ దాదాపు రూ.140 కోట్ల వరకూ ఉండేది. తాజాగా ప్రభుత్వం ఆ బడ్జెట్‌ను కేవలం రూ.36 కోట్లకు కుదించడంపై ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జీతమో రామ‘చంద్రా..’
ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా పింఛన్ల కింద రూ.54 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే సిబ్బంది జీతాలకు మరో రూ.52 లక్షల వరకూ అవసరం. ఇక గ్రంథాలయాల నిర్వహణ, అద్దెలు, విద్యుత్ బిల్లులు, దిన పత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు తదితర ఖర్చులు కూడా సిబ్బంది జీతాల గ్రాంటులోనే ఉంటుంది. అయితే మూడు నెలల నుంచి గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలను కూడా ప్రభుత్వం బట్వాడా చేయలేకపోతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు జీతమో రామ‘చంద్ర’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పెండింగ్‌లో..
గ్రంథాలయాల్లో దిన పత్రికల నిధులను ప్రభుత్వం పంపించకపోయినప్పటికీ ఆయా గ్రంథాలయాల ఉద్యోగులే అరువు పద్ధతిలో ఏదోలా పత్రికలను వేయించుకుని పాఠకులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ఇక పోటీ పరీక్షల పుస్తకాల సరఫరా అయితే మూడు నెలల నుంచే కాదు అంతకు ముందు నుంచే నిలిచిపోయింది. ఇక అద్దె భవనాల్లో కొనసాగుతున్న గ్రంథాలయాలకు అద్దెలు, విద్యుత్ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
గుదిబండగా సెస్ బకాయిలు
ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు విపరీతంగా పెరిగిపోయి గ్రంథాలయ నిర్వహణ భారం మరింత పెరిగింది. రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ల సెస్ బకాయి రూ.18 కోట్లు, ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల నుంచి రూ.16.50 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇక మున్సిపాలిటీల బకాయిలు రూ.లక్షల్లో ఉన్నాయి. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీ నుంచి రూ.20 లక్షల మేర గ్రంథాలయ సెస్ వసూలు కావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకుని జీతాలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడంపై గ్రంథాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ జీతాలను ఎప్పటిలాగే గ్రాంటు రూపంలో విడుదల చేయాలని కోరుతున్నారు.
సిబ్బంది కొరత
ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. 204 రెగ్యులర్ పోస్టులకు గాను కేవలం 55 మందే పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టులు 37కి 27, లైబ్రేరియన్, రికార్డు అసిస్టెంట్లు, హెల్పర్లు పోస్టులు 37కి 27 మాత్రమే ఉన్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో 102 శాఖా గ్రంథాలయాలకు 100 పనిచేస్తున్నాయి. ఇక 51 గ్రామీణ గ్రంథాలయాలకు నాలుగు, 161 పుస్తక పంపిణీ కేంద్రాలకు 138 మాత్రమే పనిచేస్తున్నాయి.
ఫ గ్రంథాలయాలపై
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం
ఫ మూడు నెలలుగా
నిలిచిన సిబ్బంది జీతాలు
ఫ పోటీ పరీక్షల పత్రికల సరఫరా
నిలిపివేత
ఫ దిన పత్రికలకు బిల్లులు నిల్
ఫ బడ్జెట్‌లోనూ భారీ కోత
గ్రంథాలయాలను పరిరక్షించాలి
నిర్వీర్యమవుతున్న గ్రంథాలయ వ్యవస్థను రక్షించాలి. దీని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. గ్రంథాలయ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు. దిన పత్రికల బిల్లులు ఇవ్వకపోగా, పోటీ పరీక్షల పుస్తకాలను నిలిపివేయడం తగదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆందోళనకు దిగక తప్పదు.
– జీవీఆర్‌ఎస్‌హెచ్‌కే వర్మ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


