● పూర్తయిన దేవరపల్లి –
ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే
● ట్రయల్ రన్‌కు అధికారుల అనుమతి
● వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభం
దేవరపల్లి: ఉభయ తెలుగు రాష్టాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండు వారాలుగా కొత్త హైవేపై ట్రయల్ రన్‌కు అధికారులు అనుమతి ఇవ్వడంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వాహనాలు రయ్..రయ్‌మంటూ దూసుకు వెళ్తున్నాయి. కరోనా, అధిక వర్షాలు, భూ సేకరణలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకుల కారణంగా దీని నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని పనులూ దాదాపు పూర్తి కావడంతో ఈ హైవేను మే నెలలో అధికారికంగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు
● దేవరపల్లి – ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భారత్‌మాల పరియోజన–1 కింద కేంద్ర ప్రభుత్వం 2018 మే 23న అనుమతి ఇచ్చింది. 2022లో పనులు చేపట్టారు. దేవరపల్లి నుంచి తెలంగాణలోని ఖమ్మం వరకూ మొత్తం 162 కిలోమీటర్ల పొడవున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో ఈ హైవే నిర్మించారు.
● ఈ హైవే మొత్తం పచ్చని పొలాల మధ్య నుంచి సాగుతుంది
● ఏపీ – తెలంగాణ మధ్య 4 వరుసల మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇదే కావడం విశేషం.
● అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) కింద ఈ హైవేపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 95 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి సోలార్ విద్యుత్‌తో పని చేస్తాయి. వీటి ద్వారా రోడ్డుకు ఇరువైపులా సుమారు కిలోమీటరు దూరం వరకూ నిఘా ఉంచుతారు. మార్గం మధ్యలో ఎక్కడైనా ప్రమాదం, మరేదైనా సంఘటన జరిగితే వెంటనే కంట్రోల్ రూముకు సమాచారం అందుతుంది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణకు తెలంగాణలోని కల్లూరు సమీపాన కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
● హైవేపై రాత్రి వేళ వెలుతురు కోసం సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
● అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేశారు.
● ఈ రోడ్డుపై ప్రయాణించిన దూరానికే టోల్ చార్జీలు చెల్లించే ఏర్పాటు చేశారు.
● చైన్నె – కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారి, దేవరపల్లి – ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే దేవరపల్లి వద్ద అనుసంధానమవుతాయి. ఇక్కడ డ్రమ్‌ఫుట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పచ్చని గ్రీన్‌పార్క్ ఏర్పాటు చేశారు. ఈ హైవేకి ఇరువైపులా ఎక్కడా సర్వీస్ రోడ్లు ఉండవు.
● ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి విజయవాడ, సూర్యాపేట మీదుగా 12 గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. దేవరపల్లి – ఖమ్మం గ్రీన్‌పీల్డ్ హైవే వల్ల 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 4 గంటల సమయం ఆదా అవుతుంది.
గ్రీన్‌ఫీల్డ్ హైవే స్వరూపమిదీ..
నేషనల్ హైవే నంబర్ 365 బీజీ
పొడవు 162 కిలోమీటర్లు
వరుసలు 4
వ్యయం రూ.4,451కోట్లు
కేంద్రం అనుమతి ఇచ్చిన తేదీ 2018 మే 23
పనులు ప్రారంభం 2022
టోల్ ప్లాజాలు 8
మైనర్ బ్రిడ్జిలు 51
మేజర్ బ్రిడ్జిలు 9
మేజర్ పనులు పూర్తి
అక్కడక్కడ చిన్నచిన్న పనులు మినహా గ్రీన్‌ఫీల్డ్ హైవేలో మేజర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం వాహనాల ట్రయల్ రన్‌కు అనుమతించాం. వచ్చే నెలలో ఈ హైవే ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అధునాతన సాంకేతికతతో దీని నిర్మాణం జరిగింది.
– బి.కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్
హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎహెచ్‌ఏఐ), రాజమహేంద్రవరం


