● నేడు నన్నయ స్నాతకోత్సవం
● చాన్సలర్ హోదాలో
పాల్గొంటున్న గవర్నర్
● వర్సిటీలో పూర్తయిన ఏర్పాట్లు
నన్నయ వర్సిటీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (ఫైల్)
వర్సిటీ ముఖద్వారం
రాజానగరం: తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం పట్టాల పండగ జరగనుంది. గతంలో 2024 జనవరిలో వర్సిటీ 13, 14, 15వ స్నాతకోత్సవాలు నిర్వహించారు. ఆ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో పాల్గొన్నారు. మళ్లీ రెండేళ్ల తరువాత నేడు జరుగుతున్న 16, 17వ స్నాతకోత్సవాల్లో కూడా ఆయనే చాన్సలర్ హోదాలో పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
722 మందికి పట్టాల ప్రదానం
2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో నన్నయ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ 6,113 మంది, అండర్ గ్రాడ్యుయేషన్ 45,337 మంది పూర్తి చేశారు. అయితే, మొత్తం ఈ 51,450 మందికి గాను ఇప్పటి వరకూ 722 మంది మాత్రమే ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
భద్రత కట్టుదిట్టం
గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో వర్సిటీ, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గవర్నర్ విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నన్నయ యూనివర్సిటీకి చేరుకుని, స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు జీజీయూకు చేరుకుని హెలికాప్టర్‌లో తిరిగి విజయవాడ పయనమవుతారు. హెలీపాడ్, వర్సిటీలో స్నాతకోత్సవం జరిగే ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లను ఎస్పీ నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం ఆర్‌డీఓ ఆర్.శివరాముడు, గవర్నర్ భద్రతా సిబ్బంది గురువారం పరిశీలించారు. భద్రపరమైన అంశాలపై జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, గవర్నర్ సెక్యూరిటీ అధికారులతో చర్చించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ఎస్పీ నరసింహ కిషోర్, ఆర్‌డీఓ శివరాముడు, గవర్నర్ భద్రతా సిబ్బంది తదితర ఉన్నతాధికారులు వర్సిటీ ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు. ట్రయల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
పండగలా నిర్వహించుకుందాం
నన్నయ యూనివర్సిటీ 16, 17 స్నాతకోత్సవాన్ని పండగలా నిర్వహించుకుందాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ వేడుకల్లో వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, జాతీయ భద్రతా మండలి మాజీ సలహాదారు ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి తదితరులు పాల్గొంటున్నారు.
– ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ఉపకులపతి,
ఆదికవి నన్నయ యూనివర్సిటీ
వైఎస్సార్ చేతుల మీదుగా..
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల స్వప్నం ఆదికవి నన్నయ యూనివర్సిటీ. సంస్కృతీ సాహిత్యాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం సమీపాన రాజానగరం మండలం వెలుగుబంద వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఈ వర్సిటీకి భూమి పూజ చేశారు. తద్వారా ఈ ప్రాంత ప్రజల కలను ఆయన సాకారం చేశారు. మొత్తం 98 ఎకరాల విస్తీర్ణంలో పదహారో నంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ యూనివర్సిటీ అచిరకాలంలోనే స్వశక్తితో అభివృద్ధి సాధిస్తూ, అందరి ప్రశంసలూ అందుకుంటూ, 19 వసంతాలు పూర్తి చేసుకుంది. విద్యాసుమాలు విరబూస్తోంది. ఈ వర్సిటీకి అనుబంధంగా 440 కళాశాలలున్నాయి. ఇప్పటికే 12బితో పాటు ఐఎస్‌ఓ, ఏఐసీటీఈ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) బి+ వంటి గుర్తింపులను ఈ విశ్వవిద్యాలయం దక్కించుకుంది. అలాగే గ్రీన్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్, జెండర్ సెన్సిటైజేషన్ వంటి గుర్తింపులతో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది.


