12న రోల్‌బాల్‌ జిల్లా స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

12న రోల్‌బాల్‌ జిల్లా స్థాయి పోటీలు

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): ఈ నెల 12న దానవాయిపేట గాంధీపురం పార్కులోని స్కేటింగ్‌ రింక్‌లో జిల్లా స్థాయి రోల్‌బాల్‌ పోటీ లు, ఎంపికలు నిర్వహిస్తున్నారు. జిల్లా రోల్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు వై.రుద్రశ్రీ మహశ్వి, జి.అప్పారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 25, 26 తేదీల్లో పిడుగురాళ్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి ఉన్న వారు 90145 18799 నంబరులో సంప్రదించాలని సూచించారు.

హుండీ ఆదాయం

రూ.4.31 లక్షలు

పెరవలి: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం వచ్చింది. అధికారులు, బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో హుండీలను గురువారం తెరిచి, 43 రోజులకు గాను ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4,25,969, అన్నదాన హుండీ ద్వారా రూ.5,089 కలిపి మొత్తం రూ.4,31,058 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని, దీనికి దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గొర్ర గేదె సంచారం

గోకవరం: మండలంలోని తిరుమలాయపాలెం అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం గొర్ర గేదె సంచరించింది. రంపయర్రంపాలెం, తిరుమలాయపాలెం ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతూండగా కొందరు ప్రయాణికులు గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గొర్ర గేదె సంచారం వార్త గుప్పుమనడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో గొర్ర గేదెలు సంచరించిన దాఖలాలు లేవని, అది దారి తప్పి ఇక్కడకు ఎలా వచ్చిందనే దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

12న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

తుని రూరల్‌: హంసవరంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న జరుగుతుందని ఎంఈఓ పరవాడ గీతాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మోడల్‌ స్కూల్‌లోనే ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 157 మంది విద్యార్థులు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని, గంట ముందుగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement