● రాజానగరం జనసేనలో అసమ్మతి రాగం
● అగ్గి రాజేస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ
● తమకు ప్రాధాన్యం దక్కలేదంటూ అసంతృప్తి
సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం నియోజకవర్గం జనసేనలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యవహార శైలే దీనికి కారణంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో కష్టపడిన వారి ని కాకుండా తనకు భజన చేసే వారినే ఆయన చేర దీస్తున్నారని అసంతృప్తి నేతలు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తన భజన బృందానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని విమర్శిస్తున్నారు.
అండగా నిలిచినా అన్యాయమే!
గత సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం స్థానాన్ని టీడీపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, అప్పటి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. అయితే, కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు ను జనసేనకు కేటాయించారు. దీనిపై భగ్గుమన్న బొడ్డు వర్గీయులు అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడినే ఏకంగా నిలదీశారు. ఆ పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి బత్తుల బలరామృష్ణకు అండగా నిలిచామని, ఎన్నికల్లో ఆయన విజయానికి శ్రమించామని. కానీ, అధికారంలోకి రాగానే తమను కాదని, తనకు చిడతలు కొట్టే వారిని ఎమ్మెల్యే చేరదీస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చివరకు కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా చేపట్టిన సొసైటీ ప్రెసిడెంట్, ఆలయ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ భజనపరులకు, తన అనుచరులకే అందలం వేస్తున్నారంటూ జనసేనలోని ఓ వర్గం మండిపడుతోంది.
పట్టం కట్టారిలా..
నాతిపాము దొరబాబుకు రాజానగరం సొసైటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గళ్ల రంగా భార్యకు సైతం పదవి ఇచ్చారు. ముక్క రాంబాబు భార్యకు కోరుకొండ ఏఎంసీ డైరెక్టర్, బత్తుల గోపాలకృష్ణకు కోరుకొండ సొసైటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. యర్రంశెట్టి శ్రీనుకు పార్టీలో కీలక పదవి ఇచ్చినట్లు సమాచారం. దేవన దుర్గాప్రసాద్(డీడీ)కు కోరుకొండ పీఏసీఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. వాకపల్లి రాజు, సైతిని చల్లారావుకు సైతం నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యే అల్లుడు తోట అనిల్ వాసుకు సైతం పదవి కట్టబెట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని, పార్టీ కోసం ఏనాడూ కృషి చేయని ఇటువంటి వారికి పదవులు ఎలా ఇస్తారని అసమ్మతి వర్గ్గీయులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో సైతం వారి కే ప్రాధాన్యం కల్పించడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీకి సంబంధం లేని, రాజకీయం తెలియని నేతలకు పదవులు కట్టబెట్టడంపై అసమ్మతి వర్గం లోలోపల మండిపడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ వారు సవాల్ విసురుతున్నారు.
బీజేపీకి జెల్ల
మూడో దశ నామినేటెడ్ పదవుల భర్తీలో బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపారు. టీడీపీలోనే నామినేటెడ్‌పై ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితుల్లో బీజేపీకి ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, తమ తోడ్పాటు తో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. మద్యం, ఇసుక వ్యాపారాలన్నీ టీడీ పీ నేతలకే కట్టబెట్టారని, కనీసం నామినేటెడ్ పద వుల్లోనైనా తమకు న్యాయం చేయకపోతే ఎలాగ ని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నీటి సంఘాలు, సొసైటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయగా, వాటిలో బీజేపీకి ఒక్క సొసైటీ చైర్మన్ పదవి మాత్రమే దక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


