ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు రాజమహేంద్రవరం నుంచి నడుస్తున్న ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఆర్.సురేష్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు కలసి బుధ, గురువారాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి ఈ బస్సులలో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. బస్సుల దిగువ భాగాన అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను (ఎస్కేప్ హ్యాచ్, డోర్) లగేజీతో మూసివేయడం, నిబంధనల ప్రకారం వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. జిల్లా రవాణా అధికారి సురేష్ గురువారం స్వయంగా ఒక బస్సును తనిఖీ చేయగా, అందులో కూడా అదనపు డీజిల్ ట్యాంకు ఉన్నట్లు గుర్తించారు. పర్మిట్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా చర్యలు అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. సీజ్ చేసిన 5 బస్సులను రాజమహేంద్రవరం రవాణా శాఖ కార్యాలయంలో భద్రపరిచారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వీటి యజమానులు సుమారు రూ.2.15 లక్షల పన్ను, అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రవాణా అధికారులు సంపత్ కుమార్, ప్రణీత్, ఉమామహేశ్వరరావు, రాధిక, సుమ పాల్గొన్నారు.


