తాళ్లపూడి/సాక్షి నెట్‌వర్క్: మహిళలను కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన పలువురు నాయకులు కొవ్వూరులో ఎస్సై వంశీ అలెగ్జాండర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసభ్యకర వ్యాఖ్యలను రాధాకృష్ణ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. గతంలో సైకిల్‌పై తిరగిన రాధాకృష్ణ మీడియా ముసుగులో నేడు వేల కోట్ల రూపాయలు ఏవిధంగా సంపాదించారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, వారి భార్యలపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర కార్యదర్శులు పిట్టా శ్రీనివాస్, వల్లభశెట్టి శ్రీనివాస్, తాళ్లపూడి మండల కన్వీనర్ కొలిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టా ఏడుకొండలు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండపేట, అనపర్తి, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, గోపాలపురం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పేపర్, చానల్ ఉన్నాయి కదా అని పాత్రికేయ విలువలను తుంగలో తొక్కి, ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా, రాసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.


