జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి అమానుషం
రాజమహేంద్రవరంసిటీ: ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించాలని, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జమ్మూ కాశ్మీరులోని పహాలగాడ్ వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వేణుగోపాలకృష్ణ నాయకత్వంలో రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. ఉగ్రవాదాన్ని వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. మాజీ హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కాశ్మీర్లో పర్యాటకుల మీద కక్షపూరితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమైన విషయమన్నారు. మాజీ ఎంపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ ఉగ్రవాదులు పిరికిపంద చర్యలను దేశ పౌరులు ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ,యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ అమాయకుల మీద చేసిన దాడి చాలా బాధాకరమని భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాడుల పట్ల స్పందించవలసిన అవసరం ఉందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడి హేయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఈ దాడి ప్రతి పౌరుడినీ కన్నీరు పెట్టించిందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నందెపు శ్రీను,తోట రామకృష్ణ, అడపా అనిల్, అన్ని నియోజక వర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
ఉగ్రవాద దాడిని
నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ


