కుక్కల దాడిలో నెమలికి గాయాలు
● రక్షించిన హెడ్‌కానిస్టేబుల్
● అటవీ అధికారులకు అప్పగింత
రాజమహేంద్రవరం రూరల్: జాతీయపక్షి నెమలిని కుక్కల బారినుంచి రక్షి క్షించిన సంఘటన ఆదివారం ఉదయం కొంతమూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమూరు పప్పులమిల్లు ప్రాంతంలో 14 ఎకరాల లే అవుట్‌లో వై.రామవరం హెడ్ కానిస్టేబుల్ కేవీ మాధవ్ నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం సమయంలో ఎటునుంచో వచ్చిన నెమలిని కుక్కలు తరుముతున్నాయి. ఈ లోగా కేవీ మాధవ్ కుమారుడు చూసి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మోటర్‌సైకిలిస్ట్ కుక్కలను తరమడం జరిగింది. దీంతో గాయపడిన నెమలిని హెడ్‌కానిస్టేబుల్ మాధవ్ ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేసి, వెంటనే ఫారెస్టు ఆఫీసర్‌కు ఫోన్ చేశారు. అధికారులు నెమలిని తమ కార్యాలయానికి తీసుకువచ్చి అప్పగించాలని కోరారు. దీంతో కేవీ మాధవ్ లాలాచెరువు పుష్కరవనం దగ్గర ఉన్న ఫారెస్టు రేంజ్ ఆఫీసుకు తీసుకువెళ్లి ఫారెస్టు రేంజ్ అధికారి దావీదురాజుకు అప్పగించారు. జాతీయ పక్షి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సేవలు అందించి అనంతరం అడవిలో వదిలేస్తామని దావీదు రాజు వెల్లడించినట్టు హెడ్‌కానిస్టేబుల్ కేవీ మాధవ్ తెలిపారు.


