హిజ్రా దారుణ హత్య

Hijra brutal murder - Sakshi

తూర్పు గోదావరి: జొన్నాడ బస్టాండ్‌ సమీపాన జాతీయ రహదారి పక్కన ఓ హిజ్రా దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మరిపట్ల ఆనంద్‌ ఆలియాస్‌ ఆనంది (33) కొన్నేళ్లుగా ధవళేశ్వరంలో నివాసం ఉంటోంది. అమ్మానాన్నలను చూసేందుకు వెళ్తానంటూ ఆమె కొంత నగదుతో బయలుదేరినట్టు సహచర హిజ్రాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జొన్నాడలోని 216ఎ జాతీయ రహదారి పక్కన పంట కాలువ డ్యామ్‌ సమీపాన పశువుల పాక చెంతన ఉన్న పంట కాలువలో శవమై కనిపించింది.

ఆమెను పాశవికంగా హతమార్చిన దుండగులు ఆమె మృతదేహాన్ని పంట కాలువలో కుక్కేశారు. ఆనంది మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతు సత్తి సత్యనారాయణరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ నేతృత్వంలో రావులపాలెం సీఐ ఎన్‌.రజనీకుమార్‌, ఎస్సైలు ఎం.వెంకటరమణ, ఎస్‌.శివప్రసాద్‌లు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాకినాడ నుంచి వేలిముద్ర నిపుణుడు కె.ప్రవీణ్‌కుమార్‌ బృందాన్ని, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. తనిఖీలు చేయించి ఆధారాలు సేకరించారు.

అక్కడ లభించిన ఆనవాళ్లను బట్టి హత్యకు ముందు తీవ్ర పెనుగులాట జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్సై శివప్రసాద్‌ చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆనంది హత్య విషయం తెలియడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో హిజ్రాలు సంఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పోలీసులకు అనుమానితుల పేర్లు అందించి, ఆ దిశగా విచారణ జరపాలని అభ్యర్థించారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top