కాట్రేనికోన: మోటారు సైక్లిస్టును లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొంతికుర్రు మర్ల చెరువుకు చెందిన ఈతకోట శ్రీనివాసరావు (46) మోటారు సైకిల్‌పై శుక్రవారం వస్తుండగా, తిమ్మాపురం సమీపంలో లారీ ఢీకొంది. శ్రీనివాసరావు తలకు బలమైన గాయం కావడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలో అతను మరణించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య విజయ కుమారి, పెళ్లిళ్లు కాని ఇరవై ఏళ్లలోపు అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృత్యుతవాత పడ్డాడనే విషయం తెలియగానే వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
కాటేజీ అద్దె సొమ్ము
దేవస్థానానికి జమ!
ద్వారకాతిరుమల: చిన వెంకన్న కొండపై ఓ కాంట్రాక్టర్‌కు రెండు రోజుల పాటు ఉచితంగా కాటేజీని కేటాయించిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో దేవస్థానం అధికారులు స్పందించారు. ఆ అద్దెను సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా శుక్రవారం దేవస్థానం ఖజానాకు జమ చేయించారు. ఆ వివరాల్లోకి వెళితే. అమరావతికి చెందిన ‘సెవెన్‌హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు చెందిన కాంట్రాక్టర్ ఈ నెల 23న సాయంత్రం క్షేత్రానికి వచ్చారు. శ్రీనివాస నిలయం గెస్ట్ హౌస్‌లో బస చేసి 25వ తేదీ ఉదయం వరకు అక్కడే ఉన్నారు. అయితే రెండు రోజుల బసకు సంబంధించిన అద్దెను దేవస్థానానికి చెల్లించలేదు. ఇంజినీరింగ్ విభాగం ఏఈ ఆదిత్య రిఫరెన్స్‌తో కాంట్రాక్టర్‌కు గెస్ట్‌హౌస్ కేటాయించిన విషయం బయట పడటంతో వివాదం మొదలైంది.
అద్దె చెల్లింపు అంశం ముగిసినా..
2022 నుంచి 2025 సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక దేవస్థానంలో పారిశుధ్య పనులు నిర్వహించిన సదరు కాంట్రాక్టర్ కార్మికులకు పీఎఫ్ సొమ్ము సక్రమంగా చెల్లించకపోవడం, తదితర ఆరోపణల నేపథ్యంలో రూ.60 లక్షలకు పైగా సొమ్మును ఏడాది నుంచి కాంట్రాక్టర్‌కు చెల్లించకుండా దేవస్థానం నిలిపివేసింది. ఆ సొమ్మును ఎలాగైనా కాంట్రాక్టర్‌కు ముట్టజెప్పేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారన్న ఆరోపణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన దేవస్థానం అధికారులు కాటేజీ అద్దె సొమ్మును కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలని సంబంధిత ఏఈ ఆదిత్యకు సూచించారు. దీంతో ఆయన కాంట్రాక్టర్‌తో మాట్లాడి రూ.6,574ను దేవస్థానానికి జమ చేయించి, ఎంఆర్ రసీదు తీసుకున్నారని సంబంధిత సెక్షన్ ఏఈఓ ఐ.రమణరాజు తెలిపారు.


