వైఎస్సార్‌సీపీ బీసీ అయ్యరక
సంఘ రాష్ట్ర అధ్యక్షుడి విమర్శ
సామర్లకోట: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు మరో మోసానికి సిద్ధ మైందని వైఎస్సార్‌సీపీ బీసీ అయ్యరక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆయన సామర్లకోటలో విలేకర్లతో మాట్లాడుతూ బీసీలను మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం హైకోర్టు తీర్పుతో బెడిసికొట్టిందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి రిజర్వేషన్లను సాధిస్తామని చెప్పడం బీసీ సమాజాన్ని మరోసారి వంచించేందుకు కుట్రలు చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992లో వెలువడిన చరిత్రాత్మక ఇందిరా సహాని కేసు తీర్పు ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్వష్టంగా తేల్చిచెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆవాల గుర్తు చేశారు. చట్టపరంగా సాధ్యం కాని విషయాలను సాకుగా చూపిస్తూ, కోర్టుల పేరు చెప్పి కాలయాపన చేస్తూ బీసీల నోట్లో మట్టి కొడుతున్నారని లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని నమ్మించి మోసం చేయడంతో ఆ వర్గం ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. దీనిని గమనించిన ప్రభుత్వం బీసీలకు ఎర వేయడానికి ప్రయత్నం చేసిందన్నారు. బీసీలను నమ్మించడానికి ఆడుతున్న నాటకంపై అందరూ ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పాలని కోరారు.
పంచాంగం ప్రత్యక్షం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం పంచాంగం ఐదు రోజుల తరువాత శుక్రవారం వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది. గత కొన్నేళ్లుగా రోజూ పెడుతున్న దిన పంచాంగం, రోజూ జరిగే కార్యక్రమాల వివరాలు గత ఐదు రోజులుగా పెట్టకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయంపై శుక్రవారం ‘కానరాని దిన పంచాంగం’ శీర్షికన ‘సాక్షి’ వార్త ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆ పంచాంగం పోస్టు చేసే ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో శనివారం దిన పంచాంగం, ఆరోజు దేవస్థానంలో జరిగే కార్యక్రమాల వివరాలను శుక్రవారం వివిధ వాట్సాప్ గ్రూపులు, దేవస్థానం వెబ్‌సైట్‌లో పెట్టారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్ట్
తాడేపల్లిగూడెం: అంతర్ జిల్లా నేరస్తుడిని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఉభయ గోదావరితో పాటు బాపట్ల, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాల్లో అతనిపై 37 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పెదకాకాని పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాడేపల్లిగూడెంలో కారు చోరీ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. డీఎస్పీ బి.నరసింహారావు శుక్రవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కరుటూరి సూర్యతేజ సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్డులో ప్రవేశించి కారు, నగదు, సీసీ టీవీ డీవీఆర్‌ను అపహరించాడు. ఈ మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ బోఽణం ఆదిప్రసాద్ బృందం దర్యాప్తు చేపట్టి ఉంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై పెద్దాపురం, ఒంగోలులో షట్టర్ పగులగొట్టి చేసిన చోరీలు బయటకు వచ్చాయి. తాడేపల్లిగూడెంలో నమోదైన కేసుకు సంబంధించి కారు, పెద్దాపురంలో కేసుకు సంబంధించి రూ.1,63,581, ఒంగోలులో కేసుకు సంబంధించి రూ.36 వేల నగదు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కారు విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఆదిప్రసాద్, కానిస్టేబుళ్లు ఎ.దుర్గాప్రసాద్, ఆర్.మోహన్, ఎంకే రామ్‌కుమార్, బి.చైతన్యలను అభినందించారు. ఎస్సైలు బాదం శ్రీనివాసు, నాగరాజు పాల్గొన్నారు.


