కాజులూరు: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని కాకరపల్లి లోకేశ్వరి దీపిక బంగారు పతకం సాధించింది. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ ఈ విషయం తెలిపారు. ప్రధానోపాధ్యాయిని ఎస్‌ఎస్‌బీ సుశీలమణి ఆధ్వర్యాన పాఠశాలలో గురువారం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరిగిన 39వ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో దీపిక రాష్ట్ర జట్టులో ఆడిందని చెప్పారు. కేరళతో జరిగిన తుది పోరులో ఆంధ్రప్రదేశ్ జట్టు 4–3 స్కోర్‌తో విజయం సాధించి, జ్ఞాపిక, బంగారు పతకాలు అందుకున్నారని వివరించారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన దీపికను పలువురు అభినందించారు.


