అమలాపురం రూరల్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ముమ్మిడివరం పరిధిలోని అన్నంపల్లి టోల్ ప్లాజా, రావులపాలెం పరిధిలోని ఈతకోట టోల్ ప్లాజా వద్ద గురువారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం 33 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 12 బస్సులపై కేసులు నమోదు చేసి, మొత్తం రూ.18 వేలు అపరాధ రుసుం విధించారు. ఈ మేరకు జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఓలేటి శ్రీనివాస్, రవికుమార్, రాజేంద్ర ప్రసాద్, సురేష్ కుమార్, షణ్ముఖ్ శ్రీనివాస్, కౌశిక్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.


