సేవకు ఇచ్చే గౌరవం ఇదేనా? | - | Sakshi
Sakshi News home page

సేవకు ఇచ్చే గౌరవం ఇదేనా?

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

ఎండనక, వాననక ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే తలుపు తట్టి, పింఛన్లు అందించిన చేతులకు చిల్లిగవ్వ ఇచ్చేందుకు బడ్జెట్‌ సాకులు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తమ గొప్పలు చెప్పుకోవడానికి ప్రతి నెలా పారితోషికాలుగా వేలకు వేలు పంచేందుకు జీఓలు తేవడం ఎంతవరకూ న్యాయం? కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవలందించిన వలంటీర్ల కడుపు మీద కూటమి సర్కారు కొట్టింది. ఇప్పుడు పార్టీ డబ్బా కొట్టే ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనాన్ని జీతాల రూపంలో దోచిపెట్టడం ప్రజాస్వామ్యానికే అవమానం. క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలను తీర్చిన సేవకులు భారమయ్యారా? ఫోన్ల ముందు మైకులు పట్టుకుని భజన చేసే ప్రచారకులు ముఖ్యమయ్యారా? సేవకు ఇచ్చే గౌరవం ఇదేనా? – పెంకే శివ, వలంటీర్‌, అముజూరు, కె.గంగవరం మండలం

సర్కారు తీరు బాధాకరం

ప్రజలకు నేరుగా సేవలందించాం. వరదలు, కరోనా సమయంలోనూ వెనకడుగు వేయలేదు. మమ్మల్ని గాలికొదిలేశారు. మా గురించి పట్టించుకోకుండా సొంత ప్రచారానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం బాధ కలిగిస్తోంది.

– సాధానాల సత్యారావు,

ఐ.పోలవరం

సాక్షి, అమలాపురం: ఒకప్పుడు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పింఛన్లు అందించిన సేవకులు.. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి మందులు, నిత్యావసరాలు చేరవేసిన సేవాసైనికులు.. గోదావరి వరదల్లో ముంపు బాధితులకు అండగా నిలిచిన ఆత్మబంధువులు.. నేడు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేస్తామని, నెలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని చంద్రబాబు అండ్‌ కో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ కేటాయింపుల్లేవంటూ వలంటీర్లను పక్కన పెట్టారు. మరోవైపు సొంత ప్రచారం కోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కోట్లాది రూపాయలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. సర్కారు తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సొంత డబ్బాకే ప్రాధాన్యం

ఎంతో విశిష్ట సేవలందించిన వలంటీర్‌ వ్యవస్థను బడ్జెట్‌ సాకులతో రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల విధానానికి తెర తీసింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా పారితోషికాలు చెల్లించే విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో, ఎన్నో సేవలందించిన తమను గుర్తించకుండా, సొంత డబ్బా వాయించుకునేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందనే అసంతృప్తి మాజీ వలంటీర్లలో వ్యక్తమవుతోంది. ఐ–టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోందని వారు విమర్శిస్తున్నారు.

హామీ అమలుపై

స్పష్టత కావాలి

మాకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రచారం పేరుతో ఇన్‌ఫ్లుయెన్సర్లకు వేలాది రూపాయిలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి.

– పండు అంబేద్కర్‌,

వలంటీర్‌, ఉప్పలగుప్తం

ప్రాణాలకు తెగించి సేవలందించాం

కరోనా, వరదలు, భారీ వర్షాల సమయంలో గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రాణాలకు తెగించి మరీ సేవలందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు జీతాలు పెంచుతామని, విధుల్లోకి తీసుకుంటామని చంద్రబాబు ఊకదంపుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేశారు. ప్రాణాలకు తెగించి, సేవలందించిన వలంటీర్లను అభినందించాల్సిన వారే అవమానపరుస్తున్నారు.

– కాండ్రేగుల నాగబాబు,

వలంటీర్‌, వాకలగరువు, అంబాజీపేట

ఫ విపత్తుల వేళ ప్రజలకు

విశిష్ట సేవలందించిన వలంటీర్లు

ఫ వారి పొట్ట కొట్టిన చంద్రబాబు సర్కారు

ఫ నేడు సొంత ప్రచారానికి

జనం డబ్బు ఖర్చుకు నిర్ణయం

ఫ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల

విధానంపై సర్వత్రా విమర్శలు

ఫ ఐ–టీడీపీ కార్యకర్తల

కోసమేనని వలంటీర్ల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement