ఆత్రేయపురం: పేరవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వాకలపూడి వెంకట కృష్ణారావు మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. తన పదవీ కాలంలో అందరి మన్ననలూ పొందుతూ వివాదరహితుడిగా ఆయన గుర్తింపు పొందారు. స్థానిక టీడీపీ నాయకుల తీరుపై విసుగు చెందానని, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ బెజవాడ హిమబిందు సతీష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వంకా దుర్గారావు, బెజవాడ శ్రీనివాస్ తదితరులు వెంకట కృష్ణారావుకు వైఎస్సార్ సీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరిక పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
బ్లాక్ స్పాట్ల వద్ద
ప్రమాదాలను నివారించాలి
అమలాపురం రూరల్: జిల్లాలో గుర్తించిన 11 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు డ్రగ్స్ నిర్మూలన, మహిళ భద్రతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, రాష్ట్ర, ప్రధాన జిల్లా రహదారులపై సమస్యలను గుర్తించి, త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. జొన్నాడ హైవే పనులను గడువులోగా, సర్వీస్ రోడ్ల పనులను వచ్చే నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట ఆర్‌డీఓలు ఎం.సరళావతి, జీవీవీ సత్యనారాయణ, జిల్లా రవాణా, అటవీ అధికారులు కె.శ్రీనివాసరావు, ఎంవీ ప్రసాదరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బధిరులకు సమానావకాశాలు కల్పించాలి
అమలాపురం రూరల్: ఇతరులతో సమానంగా బధిరులు గౌరవం, అవకాశాలు పొందేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ బధిరుల వారోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్య, ఉపాధి, సంక్షేమం, సామాజిక భద్రత తదితర రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు ప్రతి బధిరుడికీ చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, బధిరుల భద్రత, చట్టపరమైన రక్షణకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఏవై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా
రీసర్వే పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.విజయలక్ష్మి, రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డీఓలు, రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రీసర్వే పెండింగ్‌లో ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ–కేవైసీ నమోదు వేగవంతం చేయాలన్నారు. 22–ఎకు సంబంధించిన భూ సమస్యలపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, జిల్లా పరిపాలన శాఖ అధికారి కె.నాగలక్ష్మమ్మ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


