ఐ.పోలవరం/అయినవిల్లి: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 9,69,911 క్యూసెక్కులుగా ఉన్న మిగులు జలాలు మంగళవారం సాయంత్రం 6 గంటలకు 6,38,771 క్యూసెక్కులకు తగ్గాయి. వరద తగ్గుతూండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు క్రమంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి 10 గంటలకు మిగులు జలాలు 9,47,047 క్యూసెక్కులకు, మంగళవారం ఉదయం 6 గంటలకు 8,33,506 క్యూసెక్కులకు, మధ్యాహ్నం 3 గంటలకు 6,71,221 క్యూసెక్కులకు, సాయంత్రం 6 గంటలకు 6,38,771 క్యూసెక్కులకు తగ్గాయి. వరద తగ్గుతున్నప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంకా ముంపు కొనసాగుతోంది. ముక్తేశ్వరం కాజ్‌వేపై ముంపు కాస్త తగ్గినప్పటికీ సాయంత్రం సమయానికి ఒక అడుగు మేర వరద నీరు ప్రవహిస్తోంది. పడవలపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై కూడా వరద నీరు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, రాకపోకలు సాగించే వీలు లేకపోవడంతో వాహనాలను మామిడికుదురు మీదుగా మళ్లిస్తున్నారు. వృద్ధ గౌతమీ పాయలోని పల్లపు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద వరద నీరు పాంచాల రేవు దాటి ఇళ్ల సమీపానికి చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి నీటిమట్టం తగ్గుతూండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్‌వేపై ఇంకా ముంపు కొనసాగుతోంది. పి.గన్నవరం అక్విడెక్టు వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగానే ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రవాహం క్రమంగా తగ్గుతూండటంతో దిగువన ఉన్న జిల్లాలోనూ బుధవారం ఉదయం నాటికి వరద ఉధృతి మరిత తగ్గనుంది.


