అమలాపురం టౌన్: తమ హక్కులను కాపాడాలని, గత ఏడాది మార్చి నెలలో పార్లమెంట్ ఆమోదించిన పెన్షన్ రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ పెన్షనర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల భవనం వద్ద వారు మంగళవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌జీపీఎఫ్) పిలుపు మేరకు మొత్తం 12 డిమాండ్ల సాధనకు ఈ ధర్నా నిర్వహించారు. ఎనిమిదో కేంద్ర వేతన సంఘం టెర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షన్ సవరణను చేర్చకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెన్షనర్స్ కమ్యూనికేషన్ 15 సంవత్సరాల వసూలు మొత్తాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా డీఏ, డీఆర్‌లు సకాలంలో అందించాలని, 65 నుంచి 75 సంవత్సరాల వయస్సు వరకూ ప్రతి 5 సంవత్సరాలకు 10 శాతం అదనపు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఎన్‌సీహెచ్ కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు ఆధ్వర్యాన జరిగిన ఈ ధర్నాలో అసోసియేషన్ ప్రతినిధులు ఎం.సాయి వరప్రసాదరావు, బీఆర్ కామేశ్వరరావు, జి.గోవిందరాజు, మెహబూబ్ షహీరా, కె.శ్రీనివాసరావు, జిల్లాలోని వివిధ ప్రాంతాల అసోసియేషన్ ప్రతినిధులు దేవళ్ల సత్యనారాయణ (మండపేట), కె.రాజేంద్రప్రసాద్ (కొత్తపేట), జి.సత్యనారాయణ (ఆలమూరు) తదితరులు పాల్గొన్నారు.


