అమలాపురం రూరల్: అపర భగీరథుడు ఆర్థర్ కాటన్‌పై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చేసిన వ్యాఖ్యలు బాధాకమని, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. జనుపల్లిలో కుమ్మరి కాలువ డ్రెయిన్ వల్ల ముంపునకు గురైన పొలాలను పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావుతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కుమ్మరి కాలువ డ్రెయిన్‌లో ఆక్రమణలు, పూడికలు తొలగిస్తేనే ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు వివరించారు. కుమ్మరి డ్రెయిన్ పొంగడంతో నల్లమిల్లి, జనుపల్లి గ్రామాల్లో వరి పంట ముంపునకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోతే రైతులకు రూ.5 వేలు, రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వడం కాదని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణం కుమ్మరి కాలువ డ్రెయిన్‌లో పూడికలు, ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, డ్రెయిన్ల ఆక్రమణల వలన పంట చేలు మునిగి, తీవ్రంగా నష్టపోతున్న రైతులు తమ సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే ఆనందరావును ఆయన కార్యాలయంలో కలసి, విజ్ఞప్తి చేయగా.. అవన్నీ కాటన్ దొర చేసిన తప్పులంటూ ఆయన వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. రైతు సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిఽధిగా ఎమ్మెల్యేపై ఉందన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి, రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


