ధవళేశ్వరం మత్స్యకారులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ధవళేశ్వరం మత్స్యకారులకు న్యాయం చేస్తాం

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

అమలాపురం రూరల్‌: ధవళేశ్వరం ప్రాంతంలోని మత్స్యకారులకు నిబంధనల మేరకు న్యాయం చేస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరిలో రొయ్య పిల్లల సేకరణకు సంబంధించి, బొబ్బర్లంక మత్స్యకారులతో వివాదం ఏర్పడిన నేపథ్యంలో ధవళేశ్వరం బోట్స్‌మెన్‌, ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ధవళేశ్వరం మత్స్యకార సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుని రొయ్య పిల్లల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. బొబ్బర్లంక మత్స్యకారుల వైఖరి తమపై ప్రభావం చూపుతోందని, ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై నిబంధనల మేరకు సత్వర చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించి, ఎటువంటి వివాదాలకూ తావు లేకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ రాహుల్‌ మీనా, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.కరుణాకరరావు, కాకినాడ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ అధికారి కె.శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement