ఫ భారీగా తగ్గిన కొబ్బరికాయల దిగుబడి
ఫ వెయ్యి కొబ్బరి ధర రూ.16 వేలు
ఫ ధర పెరిగినా లేని ఆనందం
ఫ మూఢం మొదలు కావడంతో మళ్లీ కష్టాలే
సాక్షి, అమలాపురం: కొబ్బరి కాయల దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగడం.. దిగుబడి పెరిగినప్పుడు ధర తగ్గడం సర్వసాధారణం అయ్యింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కొబ్బరి కాయల ధర పెరిగింది. కోనసీమ వ్యాప్తంగా కొబ్బరి కాయల దిగుబడి తగ్గింది. దీనితో ధర పెరిగిన సంతోషం రైతులకు లేకుండా పోయింది.
కోనసీమ జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. మరో 25 వేల ఎకరాలకు సరిపడా కొబ్బరి చెట్లు ఇళ్లు, కాలువలు, రోడ్ల వెంబడి ఉన్నాయి. ఏడాదికి సగటున 94.50 కోట్ల కొబ్బరి కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. కొబ్బరి పలు రకాల ఉత్పత్తులు ఉన్నా మార్కెట్ పచ్చికొబ్బరి (నీటికాయ) మీదే ఆధారపడుతోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.16 వేల వరకూ ఉంది. గత నెలలో ఇది రూ.13 వేలు ఉండగా, ఇప్పుడు రూ.మూడు వేల వరకూ పెరిగింది.
పరిస్థితి తారుమారు
సాధారణంగా వేసవిలో కొబ్బరి కాయకు పెద్దగా ధర ఉండదు. వేసవిలో ఉత్తరాది రాష్ట్రాల వారు దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజలకు మామిడి కాయలతో మొక్కుబడి తీర్చుకుంటారు. పైగా మూఢం మొదలయ్యింది. కానీ విచిత్రంగా కొబ్బరికి ధర రావడం.. అది కూడా నెల రోజులకు పైబడి నిలబడి ఉండడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం కొబ్బరికాయ దిగుబడి గణనీయంగా పడిపోవడమే. కొబ్బరి ఏడాదికి సగటు దిగుబడి వెయ్యి నుంచి 1,200ల కాయలు. వేసవిలో 1,300 నుంచి 1,500 వరకు ఉంటోంది. మార్చి నుంచి జూన్ వరకు చేసే దింపుల్లో దిగుబడి అధికం. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎకరాకు 700 నుంచి 800 మించి కాయలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం, మలికిపురం, సఖినేటిపల్లి వంటి తీర ప్రాంత మండలాల్లో 500 నుంచి 600 కాయల దిగుబడి వస్తోంది. దీనితో కొబ్బరి ధర పెరిగినా రైతులకు ఆనందం లేకుండా పోయింది. ‘రెండు నెలల కిందట కొబ్బరి దిగుబడి ఎకరాకు సగటు వెయ్యి కాయల వరకే ఉంది. అప్పుడు ధర వెయ్యి కాయలకు రూ.13 వేల వరకూ ఉండేది. ఇప్పుడు కొబ్బరి ధర రూ.16 వేల వరకూ ఉంది. కానీ దిగుబడి సగటు 700లు మాత్రమే ఉండడంతో రూ.11,200లకు వస్తోంది’ అని పి.గన్నవరం మండలం ముంజవరానికి చెందిన రైతు ముత్యాల రాజు ‘సాక్షి’కి తెలిపారు.
దిగుబడి తగ్గిన కొబ్బరి చెట్టు
తెల్లదోమ ప్రభావమే కారణమా?
కొబ్బరికి అధిక దిగుబడులు రావాల్సిన సమయంలో పడిపోవడం వెనుక తెల్లదోమ (రూగోస్ వైట్‌ఫ్లై) ఒక ప్రధాన కారణం. తెల్లదోమ వల్ల 30 శాతం కొబ్బరి కాయ దిగుబడి తగ్గిన విషయాన్ని అంబాజీపేటకు చెందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కూడా గుర్తించిన విషయం తెలిపిందే. దీనికితోడు గత ఏడాది వర్షాభావ పరిస్థితులు కూడా ఓ కారణం. జూన్ నుంచి ఆగస్టు వరకు లోటు వర్షం కారణంగా పొత్తులకు ఉండే కొబ్బరి పువ్వులు రాలిపోవడం.. తరువాత పుచ్చులు పడిపోవడం వల్ల ఇప్పుడు దిగుబడులు తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. వేసవి కావడంతో ఉత్తరాది రాష్ట్రాల వినియోగం తగ్గడంతో పాటు.. అధిక జ్యేష్టమాసం కారణంగా శుభ కార్యక్రమాలు కూడా ఆశించిన స్థాయిలో లేక నీటికాయ ఎగుమతులు జరగడం లేదని స్థానిక కొబ్బరి వ్యాపారులు చెబుతున్నారు.


