అమలాపురం టౌన్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యేవరకూ వేచి చూసి, ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా ఇప్పుడు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు విమర్శించారు. ఎన్నికల ముందు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి, తమ పార్టీకి ఓట్లు పడవని ముందే గ్రహించి ఎన్నికలు అయ్యాక పెంచడం వెనుక ప్రధాని మోదీ మోసం మరోసారి బయటపడిందని ఆయన తెలిపారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను నేడు భారత ప్రధాని మోదీ అమలు చేసి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎం చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. దీంతో రైతుల ధాన్యం కల్లాల్లోనే ఎండకు ఎండి వానకు తడిసి నాశనమౌతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ విషయంలోనూ చంద్రబాబు ఆయా కంపెనీలతో కుమ్మకై ్క ధరలు పెంచేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు రైతుల శక్తి ఏమిటో తెలియజెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులంతా జాతీయ రహదారుల పైకి ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలతో వచ్చి పంజాబ్, హర్యానా రైతుల మాదిరి ఉద్యమాన్ని చేపట్టినప్పుడు చంద్రబాబుకు బుద్ధి వస్తుందన్నారు. వరి, ఆక్వా రైతులు ఈ తరహాలో పోరాటాలు చేసి.. చంద్రబాబు సర్కారు మెడలు వంచి లాభసాటి ధరలు సాధించుకోవాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.
పెట్రోల్, డీజిల్
ధరల పెంపు దారుణం
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
సాక్షి, అమలాపురం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని, వాటిని పెంచేది లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3కు పైగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. అమలాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెంపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, జిల్లా నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా చార్జీలు భారంగా మారుతాయని తెలిపారు. దీనివల్ల అన్నివర్గాల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చమురుపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించి ధరలను నియంత్రించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతల నుంచి తప్పించుకోకుండా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున ప్రజా క్షేత్రంలో ఆందోళన చేపడుతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు.
అప్పలరాజుపేట వద్ద పులి సంచారం
రాజవొమ్మంగి: అప్పలరాజుపేట సమీపాన ఏపీ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పెంచుతున్న యూకలిప్టస్ వనాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పులి మెడలోని ట్రాకర్ ద్వారా శనివారం వేకువజామున 5 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటలకు యూకలిప్టస్ వనాల్లో పులి సంచరించిందని స్థానిక అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు. ఒంటరిగా అడవికి వెళ్లరాదంటూ అప్పలరాజుపేట, పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.


