ఫ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాస్తారోకో
ఫ వానపల్లి పీఏసీఎస్ వద్ద ధర్నా
కొత్తపేట: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్క జొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని ఆ రైతులు రోడ్డెక్కారు. వానపల్లి, బిళ్లకుర్రు, అద్దంకివారిలంక, వాడపాలెం తదితర గ్రామాలకు చెందిన మొక్కజొన్న రైతులు వైఎస్సార్ సీపీ నాయకుడు, వానపల్లి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు సత్తిరాజు (రాజా), నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు పెదపూడి బాపిరాజు తదితర నాయకులు, రైతు నాయకుల ఆధ్వర్యంలో శనివారం వానపల్లి సొసైటీ వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. కొంతసేపు కొత్తపేట – ముక్తేశ్వరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ డైరెక్టర్ బండారు రాజా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ రైతు వ్యతిరేకి అని విమర్శించారు. ఈసారి కూడా రైతులకు ఏవిధమైన తోడ్పాటు అందించకుండా, రైతు ప్రయోజనాలను గాలికొదిలేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృషితో ఏటా ఈ పీఏసీఎస్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నేటి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇటీవల రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రం తెరుస్తుందని, మద్దతు ధర కల్పిస్తుందని రైతులు ఆశించారన్నారు. గత్యంతరం లేక కొందరు రైతులు దళారులకు అయినకాడకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకులు, రైతులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఇసుకపట్ల సునీల్, బండారు సత్తిబాబు, వనుము నాగేంద్ర, గనిశెట్టి వెంకటేశ్వరరావు, గనిశెట్టి సతీష్, విఘ్నేశ్వరుడు, బండారు స్వరూప్, సూరిబాబు, కొటికలపూడి జగపతి తదితరులు పాల్గొన్నారు.


