అమలాపురం రూరల్: మండలంలోని కామనగరువు బాలయోగి కాలనీలో శనివారం వంట గ్యాస్ లీకై నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కామనగురువులో దామిశెట్టి లక్ష్మి ఇంట్లో మిక్సీ ఆడుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా మంటలు గది అంతా వ్యాపించాయి. పక్క గదిలో ఉన్న కుటుంబీకులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో లక్ష్మి కుమార్తె కాశిన శివకుమారి రెండు చేతులూ కాలిపోయాయి. మనుమరాలు అఖిలకు స్వల్ప గాయాలయ్యాయి. లక్ష్మి మేనకోడలు తాడేపల్లి సృజన రెండు కాళ్లు, చేతులకు బలమైన గాయాలు అయ్యాయి. మంటల్లో చిక్కుకున్న వీరంతా పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ నలుగురినీ 108 అంబులెన్స్‌లో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విజయనగరంలో చదువుకుంటున్న తాడేపల్లి సృజన వేసవి సెలవులకు అమలాపురం వచ్చి ఈ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, తాలూకా ఎస్సై శేఖర్‌బాబు, తహసీల్దార్ దివాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ పినిపే శ్రీకాంత్, జెడ్పీటీసీ పందిరి శ్రీహరిరామ్ గోపాల్, వైఎస్సార్ సీపీ నాయకుడు రాజులపూడి మురళీకృష్ణ, ములపర్తి శ్రీను, నక్కా చంద్రశేఖర్‌లు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కిమ్స్ వైద్యులకు సూచించారు. అలాగే ప్రమాద బాధితులను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పరామర్శించారు.


