శాంతి భద్రతలకు ఇబ్బంది రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలకు ఇబ్బంది రానీయొద్దు

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

అమలాపురం టౌన్‌: రాబోయే రోజుల్లో జాతరలు, పండగలు జరుగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఆదేశించారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాపై మరింత నిఘా పెంచాలని సూచించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో శనివారం ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌) డేటా ఆధారంగా నమోదైన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఎస్పీ ఆరా తీశారు. ముఖ్యంగా మూడేళ్ల పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో పోలీస్‌ గస్తీని మరింత పెంచాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. రౌడీ షీటర్ల కదిలికలపై నిరంతర నిఘాతో వారిపై ఉన్న పెండింగ్‌ వారెంట్లు, అరెస్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే జూలై 11న జిల్లాలో జరగనున్న లోక్‌ అదాలత్‌ కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని సూచించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement