● బ్రిడ్జి తొలగింపు పనుల్లో
మంచినీటి పైప్‌లైన్ ధ్వంసం
● నాలుగు రోజులుగా భట్లపాలెం
ప్రాంతంలో జనం అవస్థలు
అమలాపురంలో పెట్రోల్ బంకు
సాక్షి, అమలాపురం: సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నట్టుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుకు రూ.మూడు చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు శుక్రవారం తెల్లవారు జాము నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెంపు వల్ల జిల్లాలో ప్రత్యక్షంగా రైతులు, వ్యాపారులు, వాహనాల వినియోగదారులపై పరోక్షంగా సామాన్యుల మీద భారం పడనుంది. జిల్లాలో 115 వరకు పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా రోజుకు సగటున 6.8 లక్షల లీటర్ల పెట్రోల్, 4.80 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ మీద లీటరకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పెట్రోల్ వినియోగదారుపై రోజుకు రూ.20.40 లక్షలు, డీజిల్ వినియోగదారులపై రూ.12.24 లక్షల చొప్పున మొత్తం రూ.32.64 లక్షల భారం పడనుంది. పెంపుతో జిల్లాలో రూ.109.54 ఉన్న ధర రూ.112.83 వరకు చేరింది. అయితే నయార కంపెనీ గతంలో లీటరు ధరపై రూ.5 వరకు పెంచిన విషయం తెలిసిందే. అంటే లీటరుకు రూ.3.29 చొప్పున, డీజిల్ ధర లీటరు రూ.97.37 వరకు ఉండగా, ఇప్పుడు రూ.100.51కు చేరింది. పెరుగుదల లీటరుకు రూ.3.14.
తప్పని ముప్పుతిప్పలు
గత ఏప్రిల్ 20వ తేదీ నుంచి పది రోజుల క్రితం వరకు జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు వినియోగదారులు అష్టకష్టాలు పడిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కొలిక్కి రాకపోవడం, హార్మోజ్ జలసంధి ఇంకా ఇరాన్ దిగ్బంధంలోనే ఉండడంతో జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా డీజిల్ కొరత సామాన్యులను, రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. ఏప్రిల్ నెలాఖరులో వారం రోజుల పాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు రేషన్ విధించారు. మోటార్ సైకిల్‌కు రూ.200, కార్‌కు రూ.500, లారీ వంటి భారీ వాహనాలకు రూ.1,000 చొప్పున పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేశారు. డీజిల్ దొరకకపోవడంతో రబీ వరి కోతలపై ప్రభావం పడి రైతులు సకాలంలో ఊడ్పులు చేయలేకపోయారు. దీనివల్ల మే 3వ తేదీ కురిసిన అకాల వర్షానికి కొంతవరకు పంటను కూడా కోల్పోయారు. వరి రైతులతోపాటు ఎగుమతులపై ప్రభావం చూపడంతో కొబ్బరి, అరటి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల దిగుమతిపై ప్రభావం చూపి వాటి ధరలు పెరిగాయి. ఆక్వా సాగుకు డీజిల్ అందక రైతులు ఇక్కట్లు పాలయ్యారు.
రైతులపై అధిక భారం
పెట్రోల్ ధర పెంపు వల్ల వ్యక్తిగత వాహనదారులపై మాత్రమే భారం పడనుంది. ప్రధానంగా మోటారు సైకిళ్లు, కార్లు, కొంతమంది ఆటోల యజమానులు ఇబ్బంది పడనున్నారు. కాని డీజిల్ ధర పెంపు వల్ల పలు వర్గాలపై భారం పడనుంది. ప్రధానంగా రైతులపై భారం అధికంగా ఉంటుంది. వరి మాసూళ్ల నుంచి ధాన్యం ఎగుమతి వరకు, ఆక్వాలో జనరేటర్లు, ఏరియేటర్ల వినియోగం, ఎగుమతులు, కొబ్బరి, అరటి, ఉద్యాన పంటల ఎగుమతులు భారం కానున్నాయి. డీజిల్ కొరత వల్ల ఎకరా కోతకు అదనంగా రూ.ఐదు వందల చొప్పున భారం పడిన విషయం తెలిసిందే.
డీజిల్ కొరత సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులపై అదనంగా 20 శాతం భారం పడింది. లారీకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెరిగింది. జిల్లాలో 14 వేలకు పైగా ప్రయాణికుల ఆటోలు, మూడు వేలకు పైగా ట్రాన్స్‌పోర్టు ఆటోల మీద భారం పడనుంది. ఆక్వాలో వెనామీ సాగుకు సంబంధించి విద్యుత్ సౌకర్యం లేని రైతులు డీజిల్ మోటార్ల మీద, జనరేటర్ల మీద ఆధారపడతారు. వీటికి పెద్ద ఎత్తున డీజిల్ వినియోగిస్తారు. అలాగే కూరగాయలకు సంబంధించి ఉల్లి, బంగాళాదుంప, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంటాయి. వీటితోపాటు నిత్యావసర వస్తువులు, పండ్ల వంటి వాటి ధరలు కూడా పెరుగుతాయి. ఇది సామాన్యులకు భారంగా మారనుంది.
అసాంఘిక శక్తులకు
అడ్డాగా బాలయోగి స్టేడియం
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రాత్రి అయితే చాలు ఈ స్టేడియం గేట్లు బార్లా తెరచి ఉంటున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలో డ్రగ్స్ వినియోగం, అసభ్య ప్రవర్తనలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టేడియంలో ఆటలాడే వారి వద్ద నుంచి ఫీజు కింద రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నా ఆ స్థాయిలో రక్షణ చర్యలు ఉండడం లేదని ఆరోపించారు. స్టేడియం శాప్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని పేర్కొన్నారు. ఏసీలు, కరెంట్ బిల్లుల పేరిట వేలాది రూపాయలు చెల్లిస్తున్నా ఆ స్థాయిలో నిర్వహణ ఉండడం లేదన్నారు. డీఎస్‌డీవో పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాస్థలంలో బాస్కెట్ వేసవి క్రీడా శిక్షణ జరుగుతున్నా స్పోర్ట్స్ అఽధికారులు తొంగిచూడకపోవడం గమనార్హమని గుర్తు చేశారు. ఎంపీ గంటి హరీష్ మాథుర్ స్పందించి స్టేడియంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు.
ఇందుపల్లిలో వంతెన పనులు
ధ్వంసమైన భట్లపాలెం తాగునీటి పైప్‌లైన్
అమలాపురం రూరల్: మండలంలోని ఇందుపల్లిలో నూతన బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా భట్లపాలెం వెళ్లే మంచినీటి పైప్‌లైన్ ధ్వంసం అయింది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇందుపల్లి గ్రామంలో బెండ కెనాల్‌పై నూతనంగా రూ.2 కోట్లతో వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. ముందస్తుగా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు సమాచారం ఇవ్వకుండా పాత వంతెనను జేసీబీతో అధికారులు తొలగించడంతో దానిని ఆనుకొని ఉన్న పైపులైను ధ్వంసం అయింది. దీంతో భట్లపాలెంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇందుపల్లి రక్షిత మంచి పథకం నుంచి పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా జరిగేది. అది నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా వంతెన పూర్తయ్యేవరకు తాగునీరు అందించలేమని చెబుతున్నారని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలింగా పైపులు ఏర్పాటు చేసి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు తాగునీటి కష్టాలు వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వాలని ఆదేశించారు. అయితే నీరు పంపిణీ కాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు కలెక్టర్ చర్యలు చేపట్టి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
లీటరుకు రూ.మూడు చొప్పున పెంపు
పెట్రోల్ వినియోగదారులపై
భారం రోజుకు రూ.20.40 లక్షలు
డీజిల్‌పై రోజుకు పడే భారం
రూ.12.24 లక్షలు
నిత్యావసరాల ధరలు పెరుగుతాయని
వివిధ వర్గాల ఆందోళన


