– 50 రోజులకు రూ 3.24 కోట్లు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా 50 రోజులకు రూ.3,24,82,615 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. గురువారం దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్ టి పి టి శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు పీవి వి ఎస్ కామేశ్వరరావు, ఎం సత్యనారాయణల సమక్షంలో లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.2,44,76,932, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.80,05,683 లభించాయన్నారు. బంగారం73 గ్రాములు, వెండి 1,544 గ్రాములు, 14 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, శ్రీవారి సేవకులు, రావులపాలెం కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యతోనే ఉన్నత స్థాయి
అమలాపురం రూరల్: విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోనసీమ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మమ్మి పేర్కొన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అమలాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్‌ను విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవాలని తెలిపారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గుబ్బల సూర్యప్రకాశ్, మండల విద్యాశాఖ అధికారి ఎస్.దుర్గాదేవి, సీఎంఓ బి.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రహమాన్, అకౌంటెంట్ వరలక్ష్మి, అనూష, త్రినాథ్, నాగమల్లేశ్వరరావు, నాగన్న పాల్గొన్నారు.
కొత్తవీధి పరిధిలో
పులి సంచారం
రాజవొమ్మంగి: స్థానిక అటవీ క్షేత్రంలోని వయ్యేడు ఫారెస్ట్ బీట్‌లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి గురువారం రాత్రి తెలిపారు. వయ్యేడు అటవీ ప్రాంతానికి దగ్గరలోని కొత్తవీధి, కిమ్మిలిగెడ్డ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేశామన్నారు. కాగా పులి జనావాసాల్లో వచ్చే అవకాశం లేదని, రైతులు తమ పశువులను అడవిలోకి వదిలిపెట్టవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు.
సముద్ర మత్స్యకారులకు శిక్షణ
కాకినాడ రూరల్: సముద్ర మత్స్యకారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ) ప్రిన్సిపాల్ ఎస్.అంజలి అన్నారు. నైపుణ్యాభివృద్ధి, భద్రతతో కూడిన నౌకాయాన నిర్వహణే లక్ష్యంగా సముద్ర మత్స్యకారులకు ఎస్‌ఐఎఫ్‌టీలో మూడు రోజుల శిక్షణ తరగతులను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంజిన్లను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సముద్ర ప్రయాణంలో భద్రత పొందడంతో పాటు ఆదాయం కూడా పెంచుకోవచ్చని అన్నారు. ఓబీఎం అండ్ ఐబీఎం ఇంజిన్లపై ఏపీ మైరెన్ బోర్డ్ చీఫ్ సర్వేయర్ కె.రమేష్, ఇంజిన్ల మరమ్మతులపై అచ్యుతరామరాజు, సాధారణ నిర్వహణ, ఇతర అంశాలపై మత్స్య శాఖ సహాయ సంచాలకుడు కరుణాకరరావు అవగాహన కల్పించారు. శిక్షణకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన బోటు యజమానులు, సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో రిటైర్డ్ మెకానిక్ ఇన్‌స్ట్రక్టర్ బాబూరావు, కార్యక్రమ కో ఆర్డినేటర్ రామకృష్ణ, దేవానందం, అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


