పీఎండీఎస్‌ సాగుతో రైతుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

పీఎండీఎస్‌ సాగుతో రైతుకు భరోసా

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

ఐ.పోలవరం: ఫ్రీ మాన్సూన్‌ డ్రై సీడింగ్‌ (పీఎండీఎస్‌) విధానంలో సాగు వల్ల నేలతల్లి ఆరోగ్యంతోపాటు రైతు భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట రామారావు తెలిపారు. సెర్ప్‌, డీఆర్‌డీఏల సహకారంతో ఐ.పోలవరం మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలకు సరిపడా ఐదు వేల కిట్‌లను ఆయన గురువారం పంపిణీ చేశారు. పీఎండీఎస్‌ మొదటి దశను ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐ. పోలవరం మండలానికి ఆయన చేసిన తొలిసారిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడం పీఎండీఎస్‌ లక్ష్యమన్నారు. దీనిని సమర్థంగా అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో కేడర్‌ పనిచేయాలన్నారు. పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చి మేతగా ఉపయోగపడటంతో పాటు, నేలలో వానపాముల వృద్ధికి ఈ విధానం దోహదపడతాయని పేర్కొన్నారు. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, నేల కోత తగ్గడం, జీవ వైవిధ్యం అభివృద్ధి చెందడం ద్వారా సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తెలిపారు. ప్రధాన పంటలో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే శక్తి పెరిగి, దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి వాణి, ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కె.శ్రీనివాస్‌, ఏడీఏ, అదనపు జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎం.వి.వి. సత్యనారాయణ, సెర్ప్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రామకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement